పుట:Oka-Yogi-Atmakatha.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

ఒక యోగి ఆత్మకథ

మచ్చూ ఒక్క లాగే ఉండడం ఆశ్చర్యం కలిగించింది,” అన్నారాయన. “మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటీ ముందుగానే మొక్కల్లో కనిపించింది. మొక్కల మీద చేసే పరిశోధన, జంతువులకూ మనుషులకూ కలిగే బాధల్ని తగ్గించడానికి సాయపడుతుంది.”

చాలా ఏళ్ళ తరవాత, మొక్కల విషయంలో మొట్టమొదటిసారిగా బోసు కనిపెట్టిన విషయాలు, ఇతర శాస్త్రవేత్తల పరిశోధనల్లో బలపడ్డాయి. 1938 లో కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన కృషి గురించి ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఇలా రాసింది:

“నరాలు, మెదడునుంచి శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు పంపేటప్పుడు చిన్న చిన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతాయని, గడిచిన కొన్ని సంవత్సరాల్లో నిర్ధారణ అయింది. ఈ విద్యుత్ తరంగాల్ని సున్నితమైన విద్యున్మాపకాలతో (గాల్వనో మీటర్ల తో) గణించి, వాటిని ఆధునిక పరివర్ధక పరికరంతో కొన్ని లక్షల రెట్లవరకు పెంపుచేసి చూపించడం జరిగింది. ఈ విద్యుత్ తరంగాలు గొప్పవేగంతో పోతూ ఉండడంవల్ల, బతికున్న జంతువుల్లోకాని మనిషిలోకాని నాడీతంతువుల గుండా, ఇవి ఎలా సాగుతాయో పరిశీలించడానికి ఇప్పటిదాకా తృప్తికరమైన పద్ధతి ఏదీ కనబడలేదు.”

“తరచుగా, బంగారుచేపల తొట్టెల్లో వేసే మంచినీటి నిటెల్లా మొక్క తాలూకు పొడుగాటి ఏకకణాలు, వస్తుతః ఏకనాడీ తంతువుల్ని పోలి ఉంటాయని డా॥ కె. ఎస్. కోల్, హెచ్. ఆర్. కర్టిస్ రాశారు. అంతే కాకుండా, నిటెల్లా తంతువులకు ఉద్రేకం కలిగించినప్పుడు, ఒక్క వేగం విషయంలో తప్ప తక్కినవాటన్నిటిలోనూ అవి, జంతువులోనూ మనిషిలోనూ ఉండే నాడీతంతువులకు అన్ని విధాలా సమానంగా విద్యుత్ తరంగాల్ని ప్రసరింపజేస్తాయని వారు కనుక్కొన్నారు. మొక్కలో