పుట:Nutna Nibandana kathalu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోడుగున అతన్ని ఆదర పూర్వకంగా ఆహ్వానించారు. అతడు రోములో ఓ అద్దెయింటిలో వసించాడు. కాని ఒక సైనికుడు అతనికి నిరంతరం కాపలా కాశాడు.

మూడు రోజులు కడచిన పిమ్మట రోములోని యూదుల పెద్దలు పౌలుని చూడ్డానికి వచ్చారు. అతడు ప్రాత నిబంధనం నుండి ఉదాహరణలు చూపి యూదులు నిరీక్షిస్తున్న మెస్సీయా యే సేనని వారికి బోధించాడు. ఆ పెద్దలకు అతని పట్ల ఏ దురభిప్రాయంలేదు. కనుక అతని బోధను సావధానంగా విన్నారు. వారిలో కొందరు అతని వాదనను అంగీకరించారు. కొందరు తిరస్కరించారు. వారిలో వారు తీవ్రంగా చర్చించుకొని వెళ్లిపోయారు. రెండేండ్ల పాటు పౌలు అక్కడే వుండి తన్ను చూడవచ్చిన వారికందరికీ నిరాటంకంగా క్రీస్తుని బోధించాడు. ఇంతటితో అపోస్తలుల చర్యల గ్రంథం ముగుస్తుంది. ఆ మీదట పౌలుకి ఏమి జరిగిందో ఎవరికీ రూఢిగా తెలియదు.

కొందరు బైబులు పండితుల అభిప్రాయం ప్రకారం, పౌలుకి రోమను చెరనుండి విముక్తి లభించింది. అతడు మళ్లా కొంతకాలం పాటు క్రీస్తుని బోధించాడు. ఆ మీదట నీరో చక్రవర్తి క్రైస్తవులను హింసించడం ప్రారంభించాడు. ఆ హింసల్లో పౌలుని కూడ రెండవసారి రోములో బందీని చేశారు. క్రీ.శ. 67 ప్రాంతంలో అతడు అక్కడే వేదసాక్షిగా మరణించాడు. ఇంచుమించు అదే కాలంలో పేతురునికూడ రోములో సిలువ వేశారు.