పుట:Nutna Nibandana kathalu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పాడు. యూదులు న్యాయస్థానంలో పౌలు మీద ఫిర్యాదుతెచ్చారు గాని అది వీగిపోయింది. పౌలు కొరింతు నుండి అంతియోకయకు తిరిగివచ్చాడు. ఈ యాత్ర క్రీ.శ. 51-54లో జరిగింది.

106. మూడవ ప్రేషిత యాత్ర - అచ 19-20

మూడవ ప్రేషిత యాత్రలో పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చాడు. అది ఆసియా రాష్ట్రానికి రాజధాని. అక్కడ స్నాపక యోహాను జ్ఞానస్నానం పొందిన భక్తులు కొందరున్నారు. వారింకా ఆత్మను స్వీకరించలేదు. పౌలువారికి క్రీస్తు పేరిట జ్ఞానస్నానమిచ్చి వారిపై చేతులు చాచగా ఆత్మ దిగివచ్చింది. అతడురెండేండ్లు ఎఫెసులో వాక్యబోధ చేయడం వల్ల అందరూ క్రీస్తుని తెలిసికొన్నారు. అక్కడ పౌలు చాల అద్భుతాలు చేసి రోగుల వ్యాధులు కుదిర్చాడు. అతన్ని తాకినా రుమాలలు అంటించినా సరే రోగులకు వ్యాధులు నయమయ్యేవి, దయ్యాలు పారిపోయేవి. స్కేవ అనేవాని ఏడురు కుమారులు పౌలు బోధించే యేసు పేరిట నీవు వెళ్లిపొమ్మని ఓ దయ్యం పట్టినవాడి దయ్యాన్ని ఆజ్ఞాపించారు. కాని వాడు ఆ యేడురిపై తిరగబడి వారిని చితకబాదాడు. వాళ్లు బట్టలువిడచి పారిపోయారు. కనుక వారి ప్రయత్నం విఫలమైంది. పౌలుబోధమాత్రం బాగా ప్రచారంలోకి వచ్చింది. మాంత్రికులు అనేకులు తాము వాడుకొనే విలువైన మాంత్రిక గ్రంథాలను తగలబెట్టారు.

ఎఫెసు నగరానికి అర్తెమి అనే దేవత, ఆ దేవత పేరుమీదిగా సుప్రసిద్ధ దేవాలయమూ వున్నాయి. దెమిత్రి అనే కమసాలి ఈ దేవత గుడి బొమ్మలు తయారు చేసి అమ్మి లాభాలు గడించేవాడు. పౌలు విగ్రహాలు దేవుళ్లు కాదని బోధించడంచే అతని వ్యాపారం పడిపోయింది. కనుక అతడు తోడిపనివారిని ప్రోగుచేసికొని వచ్చి పౌలు మీద తగాదాకు దిగాడు. వాళ్లు పౌలు అనుచరులను బంధించి ఓ నాటకశాలకు కొనిపోయి