పుట:Nutna Nibandana kathalu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దెబ్బలవల్లా, ఆకలి దప్పలవల్లా, నెత్తురు కారిపోవడం వల్లా అలసిపోయి సిలువను మోయలేక మూడుసార్లు బోరగిల పడ్డాడు. సైనికులు కురేనియా సీమోను అనే అతన్ని బలవంతంచేసి సిలువ మోయడంలో క్రీస్తుకి సహాయం చేయించారు. దారిలో కొందరు పుణ్యస్త్రీలు క్రీస్తు శ్రమలను జూచి రొమ్ము బాదుకొని సంతాపం తెలియజేశారు. కాని ప్రభువు వారితో మీరు నా కొరకు దుఃఖించవద్దు. మీకు గొప్ప ఆపద రాబోతుంది అని చెప్పాడు.

ఇద్దరు దొంగల్లోవొకడు నీవే మెస్సీయావైతే ఇప్పుడునిన్ను నీవు రక్షించుకొని మమ్మ కూడ రక్షించు అని క్రీస్తుని నిందించాడు. కాని రెండవ దొంగ మొదటి వాణ్ణి మందలించి మనం మన నేరాలకు తగిన శిక్ష అనుభవిస్తున్నాం. ఇతడు ఏ నేరం చేయలేదు అన్నాడు. అతడు యేసు వైపు తిరిగి అయ్యా! నీవు నీ రాజ్యంలో ప్రవేశించినపుడు నన్ను కూడ జ్ఞాపక ముంచుకో అని మనవి చేశాడు. ప్రభువు నేడే నీవు నాతోపాటు పరలోకంలో వుంటావు అని చెప్పాడు.

క్రీస్తుకి చేదు కలిపిన ద్రాక్షరసం తాగడానికి యిచ్చారు.కాని యేసు దాన్ని త్రాగలేదు. సైనికులు చీట్లువేసి అతని వస్తాలను పంచు కొన్నారు. వాళ్లు యేసు కాళ్లు చేతుల్లో చీలలు దిగగొట్టి అతన్ని సిలువ మీదికెత్తారు. ప్రభువు సిలువమీద మంటికీ మింటికీ మధ్య వ్రేలాడుతున్నాడు. పిలాతు యూదులరాజైన యేసు అని విలాసం వ్రాయించి సిలువమీద పెట్టించాడు. లతీను, గ్రీకు, హీబ్రూ భాషల్లో ఆ విలాసం వ్రాయించారు. యూద నాయకులూ మరి కొందరూ అతన్ని దూషించారు. నీవు దేవుని కుమారుడ వైతే సిలువమీది నుండి దిగిరా. అప్పడు మేము నిన్ను విశ్వసిస్తాం అని హేళన చేశారు.

సిలువ క్రింద యేసు తల్లి మరియ, ఇతర పుణ్యస్త్రీలు, యోహాను నిల్చుండి వున్నారు. ప్రభువు తన తల్లిని యోహానుకు తల్లిగాను, యోహానుని ఆమెకు కుమారునిగాను సమర్పించాడు.