పుట:Neti-Kalapu-Kavitvam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiii


ఆయన సిద్ధాంతాలు చెయ్యలేదు. ఆక్షేపణలకు సమాధానాలు చెప్పకుండా సిద్ధాంతాలను ఊరికే వదల లేదు. ఏవిషయాన్ని మరుగుగానూ, ఆస్పష్టంగానూ చెప్పలేదు. ఇన్ని సుగుణాలున్న ఈ పుస్తకం సాహిత్యాభిమానులందరికీ ఆవశ్య పఠనీయం.

ఈ పుస్తకానికి చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ఒక విద్యావేత్త పరాధీనమైన తన జాతి పతనమై పోతున్నదని, విలువలు క్షీణిస్తున్నాయని, ప్రమాణాలు పడిపోతున్నాయని ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోటానికి కూడా ఈ పుస్తకం చదవటం అవసరం. దాదాపు అర్ధాయుష్కుడైన ఒక సాహిత్య కృషీవలుడు ఉన్న కొద్ది జీవితకాలం లోనే ఎన్ని విద్యలు నేర్వవచ్చునో, తాను లోక కళ్యాణమని ఎంచిన దాన్ని ఆచరించటానికి ఎంత కృషి చేశాడో తెలుసుకోటానికి ఆయన జీవితాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.

అయితే ఉమాకాంతంగారు భావకవిత్వం గురించి చేసిన నిర్ణయాలు కాలంలో నిలవలేదు. మారుతున్న అభిరుచుల కనుగుణంగా భావ కవిత్వం చరిత్రలో నిలిచింది. స్థిరదోషాలుగా ఉమాకాంతంగారు గుర్తించినవి 'అస్థిర మైనవిగా మారినాయి. వాటిని దోషాలుగా పాఠకులు గుర్తించ లేదు. అయోమయత్వం. పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం అని పేర్లు పెట్టి ఆయన నిరసించిన వాటిని తరవాత పాఠకులు గుణాలుగా మెచ్చుకొని ఆస్వాదిస్తున్నారు. ప్రాచీన సంస్కృత సాహిత్య శాస్త్ర మర్యాదలు సర్వకాల సర్వదేశ సాహిత్యాలకీ సంపూర్ణ ప్రమాణాలుగా నిలుస్తాయని ఉమాకాంతం గారు. నిజాయితీగానే నమ్మారు. ఆయన ఆనాటి కవులను కఠినంగా విమర్శించారు. చరిత్ర ఇంకా కఠినమైనది. ఉమాకాంతంగారి ఆక్షేపణలను తోసిపుచ్చింది. కాలం మరీ క్రూరమైనది. ఉమాకాంతం గారినే మరుగున పడేట్టు చేసింది. నిర్భీకత, కాలానికి ఎదురీదే లక్షణం, పాండిత్యం, కృషి. చెప్పేవిషయంలో నిజాయితీ, స్పష్టత, సూటిదనం, సహేతుక వాదపటిమ ఆయన నిర్ణయాలను మించి విలువైనవి. అవే ఆయన తన తరువాత తరానికి అందించిన విలువలు.