పుట:Neti-Kalapu-Kavitvam.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiv

సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతంగారి నిర్ణయాలు ముఖ్యంకాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాశ్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు.

ఈ ముద్రణలో సంపాదకుడుగా నేను చేసిన మార్పులకూ, చెయ్యని మార్పులకూ కొంత సంజాయిషీ ఇచ్చుకోటం భావ్యం అనుకుంటాను.

ఈ గ్రంథం తొలి ముద్రణలోనే కొన్ని పొరపాట్లు దొర్లినాయి. వాటిని అన్ని చోట్లా సవరించటం సాధ్యం కాలేదు. సంస్కృతంలో అచ్చు తప్పులను ఆచార్య రవ్వా శ్రీహరిగారు సవరించారు. తెలుగు పద్యాల్లో స్పష్టంగా దోషాలుగా కనిపించే వాటిని సవరించాను కాని కొన్నిటిని వదిలేశాను. ఉదాహరణకు 'ఏకాంత సేవ అనే పుస్తకాన్ని 'యేకాంత సేవ' అని రాయటమే కాక పుటల సూచిక (ఇండెక్స్) లో కూడా అట్లాగే ఇచ్చారు. అట్లాగే ఆ కావ్యంనుంచి ఉదాహరించిన పద్య భాగంలో "మధుర మోహన కళామహితమై వుండ (పే.జీ 71, 88, 94} అనే పాదంలో ఉండ అనే క్రియా పదాన్ని 'వుండ' అని రాశారు. యకార, వకారాగమాలు కవ్యుదోషాలు కావనుకుంటాను. అయినా ఉమాకాంతం గారు కావాలనే అట్లా రాశారని అభిప్రాయ పడి వాటిని మార్చలేదు. అట్లాగే ఉమాకాంతంగారు ఉదాహరించిన పద్యపాదాలు ఇప్పుడు దొరికే ప్రతుల్లో వేరుగా కనిపిస్తున్నా, ఆయన చూసిన ప్రతుల్లో అట్లా ఉండి ఉండవచ్చునని మార్చలేదు. స్పష్టంగా ఛందో దోషాలున్న చోట మాత్రం ముద్రిత ప్రతుల ననుసరించి సవరించాను. అట్లాంటి మార్పులు తెలుగు భారతం నుంచి, ఆ ముక్తమాల్యద నుంచి ఉదాహరించిన చోట్ల అవసరమయ్యాయి. ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా నుంచి ఉదాహరించిన భాగం (పే.జి. 136) లో ఇంగ్లీషులో Jonffroy అనీ తెలుగులో 'జాన్ ఫ్రాయి' అని స్పష్టంగా ఇచ్చారు. ఈ పేరులో ఏదో పొరపాటున్నట్టు కనిపిస్తున్నది గాని సవరించటం సాధ్యం కాలేదు. ఆ