పుట:Neti-Kalapu-Kavitvam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxi


తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనాన్ని రేపిన గ్రంథం ఇది. "కాని వారు చేసిన ముఖ్యమైన ఆక్షేపణలకు తగిన సమాధానం ఇంతవరకూ రానే లేదనే అనుకోవలసి వస్తోంది"అని అబ్బూరి రామకృష్ణారావు గారన్నారు. "మహాపండితులైన ఉమాకాంతం విమర్శలకు ఆనాడెవరూ జవాబు చెప్పలేక పోయారు" అని శ్రీశ్రీగారు 1960 లో విశాలాంధ్ర వారి ఆంధ్ర దర్శినిలో రాశారు. భావకవిత్వాన్ని సమర్ధిస్తూ, ప్రశంసిస్తూ, విశ్లేషిస్తూ వ్యాసాలూ, పుస్తకాలూ చాలా వచ్చాయి. కాని, ప్రత్యేకంగా ఉమాకాంతం గారి ఆక్షేపణలకు సమాధానంగా ఇంతవరకూ పుస్తకరూపంలో ఏమిరాలేదన్న మాట నిజమే. అట్లాగే ఉమాకాంతంగారు తిట్టినా అదో గొప్పగా ఆనాటి కవులు చెప్పుకునే వారని అ.రా.కృ గారు అంటుండేవారు. అంతటి మహాపండితుడి దృష్టిలో పడటమే గొప్పగా ఆనాటి కవులు భావించేవారన్న మాట. ఆనాటి భావకవుల్లో బహుశా ఎవరినీ ఆయన క్షమించలేదు. విస్తర దోషాన్ని గురించి విస్తరణాధి కరణంలో చెబుతూ చెప్పవలసినదానికంటే ఎక్కువగా చెప్పటం విస్తర దోషమని నిర్వచించి, ఈ కాలపు కృతుల్లో ఇది విస్తారంగా ఉందని ప్రస్తావించి "యెంకి పాటల వంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీ కాలపు కృతుల్లో అనేకాల్లో యీ దోషం కనబడుతున్నది" అని యెంకి పాటలకు మినహాయింపు ఇచ్చారు. ఆ మాత్రం మినహాయింపు ఇయ్యటం కూడా విశేషమే ననుకుంటాను.

ఆధునిక కవిత్వం ప్రాచీన ధోరణుల నుంచి విడివడి కొత్తదారులు వెతుక్కుంటున్న సమయంలో అక్కిరాజు ఉమాకాంతం గారు సాహిత్య విమర్శలో ప్రవేశించారు. సంప్రదాయ పండితులు చాలామంది భావకవిత్వాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఉమాకాంతం గారి మార్గం భిన్నమైనది. ఆయనకు తెలుగులోనే కవిత్వం కనపడలేదు. ఆయన ప్రమాణాలు ప్రాచీన సంస్కృతాలంకారికులవి. వాద పద్దతి సంస్కృతంలో తర్కపద్ధతి. ఈ పద్ధతిలో సిద్ధాంతం - పూర్వపక్షం, ఆక్షేపణ - సమాధానం అనే విభజనలుండటం వల్ల దీనికి ప్రామాణికతే గాక హేతుబద్ధత కూడా వచ్చింది. ఈయనకు పాశ్చాత్య తర్కపద్దతితో