పుట:Navanadhacharitra.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxiii

సంబంధము కలదనువాడుక ప్రబలియున్నచో నాతఁ డద్దానిని సూచించియైన నుండకపోఁడుగదా. ఈతనికి సమకాలికుఁడో సుమారు పాతిక సంవత్సరముల తరువాతివాఁడో యగు నప్పకవి యీతని సారంగధరచరిత్రమునుండి లక్ష్యముల గ్రహించి యుండుటచే సారంగధరుని గూర్చిన కథయంతయు మాళవ దేశమునకు సంబంధిచినదే యని యాతనికిఁ దెలియక యుండదుగదా. కావున నన్నయఫక్కి నాంద్రీకరించు సందర్భమునఁ దన కిష్టదైవ మగు విష్ణుమూర్తి మూలముగా వెల్లడించిన సారంగధరుని గాథయంతయు సప్పకవి సందర్భాను కూలముగాఁ గల్పించినదే యని తోఁచుచున్నది.[1]

  1. అప్పకవికి సుమారొకశతాబ్ది పూర్వము, అనఁగా క్రీ. శ. 1560 ప్రాంతమున బాల భాగవతమును ద్విపదకావ్యముగ రచించిన దోనేరు కోనేరునాథకవిని, కృతిపతియు, చాళుక్య కంఠీరవుఁడును, బుక్కభూప ప్రపౌత్రుఁడు నగు చినతిమ్మభూపాలుఁడు, పరీక్షిత్తునుండి తన తండ్రివఱకు 45 తరము లని వినఁబడుఁ గావున, నా వంశక్రమముఁ దెలుపవలయు నని ప్రార్థించుటయు, నాతఁ డట్లే చేయుచుఁ జంద్రవంశమునఁ జాళుక్యభూపాలునకు జగదేకమల్లుఁడు నాతనికి విష్ణువర్థనుఁడు గలిగి రనియు, నాతనికిరత్నాజియందు విమలాదిత్యుఁడు, నాతనికి భానుమతియందు రాజరాజ నరేంద్రుఁడు గలిగెననియు, నీతఁడు రాజమహేంద్రవరం బను పేరి రాజధానింగట్టించి వేఁగిదేశం బేలె ననియు,

    “ఆ రాజమణికార్యుఁ డగు పెద్దకొడుకు, సారంగధరుఁ డతిశాంతుఁడై యుండి,
     ఆసక్తిఁ బినతల్లియైన చిత్రాంగి, చేసిన యూపదఁ జెచ్చెరఁ గడచి
     అనఘుఁడై చౌరంగి యను సిద్ధుఁ డయ్యె, జననాథ నేఁడును జగతిపై నిలిచె
     అతఁడె యా భారతాఖ్యానంబునందు, ప్రతిలేని మొదలి పర్వంబుల మూఁటి
     నంచెఁ దెనుంగున నా నన్నపార్యుఁ, డందఱు వెఱగందు నట్లుగా నుడువ ,
     అతఁడు శ్రీకాంతయం దాత్మజుఁ గనియె, చతురతోపేంద్ర భుజాళుక్యభీము”

    అని గ్రంథాంతమునఁ జెప్పియున్నాఁడు.

    ఇందు వర్ణింపఁబడిన వంశక్రమము రాజమహేంద్రవరము నేలిన చాళుక్యవంశీయుఁడగు రాజరాజున కేమాత్రము సంబంధించినదిగాఁగనఁబడదు. నడుమ నాతనిపేరు మాత్రముజొనుపఁ బడిన ట్లున్నది. అందలి జగదేకమల్ల, విశ్వేశ్వర, కృష్ణకందాళరాయ, కళ్యాణ బిజ్జల మొదలగుపేళ్లు పశ్చిమదేశభాగము నేలిన రాజవంశములకు సంబంధించినవిగా నుండుటచేత, నా వంశములోనివాఁడే యైన మాంధాతపురాధీశుఁడగు రాజరాజును, నామసామ్యముచే రాజమహేంద్రవర పట్టణమున కధిపతిగా వర్ణించి యాతని కొమారుఁ డగు సారంగధరునిగూఁడ బేర్కొని, వీరిని విజయనగరాధిపుడైన చినతిమ్మ నృపాలుని పూర్వపురుషులనుగాఁ గని వర్ణించి యున్నాడు. ఇట్టి సందర్భము గలిగినపుడైనను, సారంగధరునకు నన్నయఫక్కితోఁ గల ,సంబంధమును గూర్చి యితఁ డేమియుఁ జెప్పలేదు. ఈ విషయము దేశమం దంతగా వ్యాప్తిగాంచి నట్లునులేదు. కావుననే యీతనికిఁ దరువాతివాఁ డగు చేమకూర వెంకటకవియు నీ కథ కాంధ్రదేశ సంబంధమును గల్పింపక, మాళవదేశమున జరిగినదానిగనె వర్ణించియున్నాఁడు.