పుట:Navanadhacharitra.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxii

ఇట్లు చెప్పుటచే నది తనకు లభ్యమైన రీతికిఁదానే యత్యాశ్చర్యమును బొంది నట్లగపడుచున్నది. మఱియు నా తెచ్చియిచ్చిన సిద్ధుఁడు తనయిష్టదైవంబగు విరూపాక్షుఁడేయనికూడఁ జెప్పినాఁడు. కావున, నప్పకవికిఁగొంతపూర్వుఁడై మొట్టమొదట నన్నయ్యఫక్కికి వ్యాఖ్యానము రచించినాఁడన్న బాలసరస్వతి యైనను ఆ నన్నయఫక్కికి సారంగధరుని కథకు సంబంధమున్నట్లు చెప్పలేదు. “నన్నయ యెక్కడ, సిద్ధుఁడెక్కడ" అనివీరికి సంబంధమేలేనట్లు చెప్పుచున్నాఁడు. ఈ కథయు నాంధ్రదేశమునకు సంబంధించిన దని యాఁతడెంచె ననుటకును నిదర్శనము లేదు. మఱియు నంతకు సుమారు రెండు శతాబ్దుల పూర్వమున నాంధ్రదేశీయుఁడగు గౌరన యీ నవనాథచరిత్రమున నా రాజమహేంద్ర సారంగధరుల కథను వర్ణించునప్పటికీకథ యాంధ్రదేశమునకు సంబంధించిన దను భావమే ప్రబలియున్న చో, రాజనరేంద్రుని రాజమహేంద్రవరము రాజధానిగా నాంధ్రదేశము నేలిన రాజుగను, ఆకథ యీ దేశమున జరిగినదిగను వర్ణింపకుండునా? ఇది యంతయు మాళవదేశమునందలి మాంధాతపురమునకు సంబంధించినదిగాను, సారంగధరునికి గాలుచేతులు వచ్చినపిదప, నచ్చటినుండి మీననాథుఁడు మాల్యవంతమునకును, బిదప నా పశ్చిమదేశభాగముమీదుగనే హిమవత్పర్వమునకు బోయినట్లును, నాగార్జున సిద్ధుఁడుమాత్రమె యాంధ్రదేశమున సంచారము చేసినట్లును, నిందు వర్ణింపబడియున్నది. కావున, గౌరనకాలమునాటికి సారంగధరుని గూర్చినకథ యాంధ్రదేశమున జరిగిన దనిగాని సారంగధరుఁ డాంధ్రదేశీయుడై యాంధ్రభాష నెఱింగి తల్లక్షణము నేర్చినవాఁ డనిగాని, వాడుక యేమాత్రము నున్నట్లగపడలేదు. ఇఁక పదునేడవ శతాబ్ది మొదట, ననఁగా క్రీ. శ. 1630 సంవత్సరప్రాంతమున తంజావూరిలో రఘునాథరాయల యాస్థానము నలంకరించి, నవనాథకథలలో నొకటి యగు సారంగధరచరిత్రమును బ్రబంధముగా రచించిన చేమకూర వెంకటకవిగూడ సారంగధరున కాంధ్రదేశముతోడను నన్నయ వ్యాకరణముతోడను సంబంధ మున్నట్లు తెలిపియుండలేదు. ఈతఁడును గౌరనవలె రాజనరేంద్రుని మాళవపతిగానే వర్ణించియున్నాఁడు.

“మహిని రాజనరేంద్రుఁడు మాళవపతి
 రాజరాజనరేంద్రుండు రాజరాజు
 ననఁగఁ బేరెన్నికకు నెక్కి యతిశయిల్లు
 నింద్రవిభవుండు రాజమహేంద్ర విభుఁడు.”

(సారంగధర చరిత్ర. 1 ఆ. 5)

కథావిషయమునను గొంతవఱకు భాషలోను గూడ నీతఁడు గౌరన ననుసరించినవాఁడే యైనను, దనకాలమున సారంగధరుని కథ కాంధ్రదేశ