పుట:Navanadhacharitra.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxi

యున్నట్లు శాసననిదర్శనము లున్నను, రత్నాంగి, చిత్రాంగి యను పేళ్లుగల భార్యలుగాని, సారంగధరుఁడను కొడుకుగాని యున్నట్లు నిదర్శన మేమియు లేదు. వేఁగిదేశము నేలిన చాళుక్యరాజగు రాజరాజనరేంద్రుఁడు, రాజమహేంద్రుఁడనియుఁ జెప్పఁ బడుటంజేసి కాఁబోలు నా మాళవదేశాధీశుఁడగు రాజమహేంద్రుని కథ యీతనియం దారోపిత మగుట తటస్థించినది. భారతమున నన్నయయే "జగజేగీ యమానానూన గుణరత్నరత్నాకరుండునై పరగుచున్న రాజరాజనరేంద్రుఁడు,

ఉ. రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ డన్యరాజ తే
    జోజయశాలి శౌర్యుఁడు విశుద్ధ యశశ్శరదిందుచంద్రికా
    రాజిత సర్వలోకుఁ డపరాజిత భూరిభుజాకృపాణ ధా
    రాజలశాంత శాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్"

అని యాతనిని రాజమహేంద్రుఁడని పేర్కొనియున్నాడు. ఈ నామ సాదృశ్యమునుబట్టి మాళవాధీశుఁడగు రాజమహేంద్రుని కొడుకగు సారంగధరుఁడు సిద్ధుఁ డయ్యెనను కథా విషయమును బురస్కరించికొని యింతకాలమునుండి లోక మేమాత్రము నెఱుఁగని నన్నయ గ్రంథ మిప్పు డెట్లు హఠాత్తుగా బయలువడె నను ప్రశ్నకు సమాధానము కుదుర్చుకొనుటకై , సారంగధరుఁడు బాల్యమున నన్నయభట్టు రచించిన లక్షణమును జదువుట, దానిని లోకమున నిలుపుటకు బాలసరస్వతి కిచ్చుట మొదలగు కథనంతను నప్పకవియే కల్పించి యాంధ్రదేశము నేలిన చాళుక్య రాజగు రాజమహేంద్రునిపైఁ బెట్టి యుండవచ్చును. అప్పకవి కథ, లేదా విష్ణువప్పకవికిఁ జెప్పినకథ, వా స్తవమేయైనచో బాలసరస్వతి తనకా గ్రంథములభించిన రీతిని దెలుపు సందర్భమున సారంగధరుని పేరైన నెత్తకుండునా ! అయితే అప్పకవి దీని నా సారంగధరుని కథతో ముడివెట్టుట కనువగునట్లుగా నాతని కొక సిద్ధుఁడు తెచ్చియిచ్చె నని యొక చిన్న సూచన యొకప్రతిలో మాత్రము పీఠికలోఁ గానవచ్చుచున్నది. ఆ పీఠికలోని పద్యములివి-

     ఏమి మహాద్భుతం బిది హరీ ! హరి! యెక్కడి యాంధ్రశబ్దచిం
     తామణిఫక్కి ! యెక్కడి మతంగనగంబు! యుగాదిసంభవుం
     డై మని చన్న నన్నయ మహాకవి యెవ్వఁడు సిద్ధుఁ డెవ్వఁడా
     హా మదగణ్య పుణ్య సముదగ్రతఁ జేకుఱుఁగాదె యారయన్ "

మ. ఇలఁబజ్ఞానిధులౌకవు ల్మునుపులేరే ! వారు వ్యాఖ్యానక
     ర్తలుగానోపరె ? పెక్కువత్సరము లంతర్భూతమైయున్న యీ
     తెలుఁగు వ్యాకరణంబు నాకొసఁగెఁ బ్రీతిం డీక గావింపుమం
     చల సిద్ధుండు మదిష్ట దేవత విరూపాక్షుండు నిక్కంబుగన్.

ఏమి మహాద్భుతం