పుట:Narayana Rao Novel.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

నా రా య ణ రా వు

దండ్రులు, అక్కలు, పెద్దయన్నయు నెందరున్నను నారాయణ క్షణము కన్పించకున్న సూర్యకాంతము బెంగపెట్టుకొనును. చిన్ననాటినుండియు సూర్యకాంతమును నారాయణరావే పెంచినాడన్న నిసుమంతయు నసత్యము లేదు. ఆమె కించుకంత దెబ్బతగిలిన ‘చిన్నన్నయ్యా’ అని యేడ్చునది. అన్నగారిదగ్గరనే పండుకొనును. అన్నగారితోనే భోజనము చేయును. ఆమెకు రామస్మరణ ‘చిన్నన్నయ్య! చిన్నన్నయ్య!’ చిన్నన్నగారు చదువులకై అమలాపురం, రాజమహేంద్రవరము, చెన్నపట్టణము వెళ్ళినప్పుడు, జైలుకు పోయినప్పుడు సర్వదా గ్రుడ్లనీరు బెట్టుకొనునది. రాజమహేంద్రవరము జైలునకన్న గారిని చూచుటకు వెళ్ళినప్పుడు నారాయణరావు జైలరు ననుమతి నడిగి చెల్లెలిని దగ్గరకు దీసికొని చెవిలో దేశభక్తినిగూర్చియు, ధైర్యమును గూర్చియు చిన్న యుపన్యాసము నిచ్చినాడు. ఆమె విచారించినచో శ్రీ మహాత్మాగాంధీ గారి హృదయము బాధ నొందుననియు, దన ముద్దు చెల్లెలు బెంగ పెట్టుకొని యింటిదగ్గర కండ్ల నీరు నింపుచున్నదని తెలిసినచో దన మనస్సు వికలమైపోయి జైలు భరించుట కడు దుర్భరమగుననియు, దన ముద్దు చెల్లెలు తనను దేశద్రోహి వలె జైలువదలి రమ్మని కోరునంతటి దేశభక్తి లేనిది కాదనియు జెప్పి, యూరడించినాడు. అప్పుడు సూర్యకాంతము కళ్ళనీళ్ళతో చిరునవ్వు నవ్వింది. ఆమె వదనము వాన కురిసి వెలిసి మబ్బులుమాయమైన పూర్ణిమాకాశమువలె సౌందర్యశోభితమైనది.

అట్టి ప్రేమపూర్ణమగు నామె హృదయము తన చిన్నన్న గారి పెండ్లి కొమరితను జూచినప్పుడెల్ల బరవశత్వములో నుప్పొంగిపోవును. తన చిన్న వదిన గారెంత యందగత్తె! ఏమి యా సొగసు! అంత సంగీత పాటకురాలెక్కడైనా యున్నదా? చిన్నవదినను కౌగలించుకో బుద్ధిపుట్టిన దా బాలకు. పెండ్లి అయిదురోజులు వీలయిన వేళలలో నొక్క నిమేషమైన కొత్తవదిన గారిని విడిచి యామె యుండలేదు. ఆమెకు దాను తలదువ్వును. ఆమె తలలో పూవులు ముడుచును. ఆమె నగలు సర్దును. ఆమె యొడిలో దనతల నుంచును. ఆమె దగ్గరగా గూర్చుండును. ‘వదినా! నువ్వు చాలా అందకత్తె’ వనును. శారద కిదియంతయు వెఱ్ఱిగా గనుపించినది. సూర్యకాంతమును వెఱ్ఱిపిల్ల యని యనుకొన్నది. కాని సూర్యకాంతము ప్రేమప్రవాహవేగమున శారద యుపేక్షా భావము చెదరగొట్టబడి కరిగిపోయినది. భర్తృ బంధుకోటిలో సూర్యకాంత మొక్కరితయే యామె హృదయములో బ్రవేశించినది.

సూర్యకాంతము వదిన గారికడ కరుదెంచి ‘చిన్నవదినా! మా గుమ్మడిపండావును జూపిస్తానన్నానుకదూ? నువ్వు దాని అందం చూస్తే వదలలేవు సుమా. రా! అప్పుడే పొలాల నుంచి మా ఆవులు, గేదెలు, బండి యెద్దులు వచ్చాయి. తక్కిన పశువులన్నింటినీ మా తోటలో పశువులశాలల్లోనే కట్టేసారు. వస్తావా?’ అని యడిగినది.