పుట:Narayana Rao Novel.djvu/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


౧౪ (14)

ఇతర దినాలు

ఈ వివాహపుతంతునం దేమి విచిత్రమున్నదో కాని, యా మూడుముళ్లు పడునప్పటికి సముద్రపుటుప్పు నడవి యుసిరిక వంటి రెండుజీవితాలు మిళితమైపోవును. ఏ కొండలలో పుట్టినవో ఏ లోయలలో ప్రవహించి వచ్చినవో, ఏ మెట్ట లెక్కినవో, ఏ పల్లముల నింపినవో, రెండు జీవిత ప్రవాహాలు చేరి యొక దారి నరుదెంచి, యీ పుణ్య వివాహవేదికకడ సంగమించి ప్రయాగ తీర్థమై పరిణమించునుకదా యనుకొని నారాయణరావు అక్కజపడెను.

తన్ను పెండ్లికొమరుని చేసినప్పుడు తాను స్నాతకపు బీటలపై తలిదండ్రులతో గూర్చుండినయప్పుడు మంగళ స్నానము లాచరించి, పట్టుపీతాంబరముల ధరించి, వివాహ వేదికపై పెండ్లిపీటపై నధివసించినప్పుడు, మంగళసూత్రద్వయము శారదకంఠమున మూడుముళ్లు వైచినప్పుడు వర్ణింపరాని భావవేగములో దేలిపోయినాడు. మంగళసూత్రధారణ మైనపిమ్మట ఎదురుగా గూర్చుండినంతనే శారద యనిన నంతప్రేమ తన్నేల యావరించినది? తాను మాతృమూర్తియు, శారద చిన్న బిడ్డయువలె నాతనికి గోచరించినది. శారదయు తాను వేలకొలది జన్మముల స్నేహితులై, గాఢానురాగమున గలసి సంచరించినట్లు తోచినది. శారదాదేవి మహారాజ్ఞియై రాజ్యమేలుచున్నట్లు తాను సేవకుడై యామెకు బరిచర్య చేయుచున్నట్టులు భావము జనించినది. శారదయు దాను నక్కచెల్లెండ్రయి యుగాల వెనుక నొక్క మేఘశకలములో నుండి విడివడిన కవలపిల్లలై యాడుకున్న ట్లూహావేశము కలిగినది. తాను పురుషుడట, శారద ప్రకృతియట; తాను పురుషోత్తముడట, శారద మహాసృష్టియట.

ఆతని కన్నులు చెమర్చినవి. తనివిదీర నా బాలికను జూడవలె ననుకొని నాడు కాని, యక్కడ ఈ వింతజూడ జేరిన యీప్రజాలోక మేమనుకొనునో యని సిగ్గుపడిపోయినాడు. ఆతని హృదయము ద్రవించిపోయినది. అతని బ్రతుకును బుష్పసౌరభము లావరించుకొనినవి. ఆ బాలికను దనకడకు జేర్చుకొని తన హృదయమున హత్తుకొనుకోర్కె పొలిమేరలు దాటినది.

‘ఒరే పరం! ఆ భావాల కంతులేకపోయినదిరా! నాకేనా, లేక ప్రతి పెండ్లికొడుక్కూ అటువంటి యావేశము కలుగునా? ఆ పిల్లకూ నాకూ మానవుడు విడబర్చజాలని బంధము ఏర్పడ్డట్టేనా? ఆ మంత్రములలో నెట్టి మాహాత్మ్యమున్నదోరా! కొంచెం కొంచెం అర్థమయ్యాయి. ఆ మంత్రోచ్చారణ విడివడి ఉన్నట్టి రెండుజీవితాలను ఏకం చేస్తున్నట్లు తోచింది. ఆ బ్రాహ్మణులు ఋషులైనట్టు, జటావల్కలాజినధారులైనట్లు నాకు కనిపించినదిరా, మా జీవితాలు రెంటికి అంటుగట్టి ఏకవృక్షం చేస్తున్న తోటమాలి లనిపించిందిరా.’