పుట:Narayana Rao Novel.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

నా రా య ణ రా వు

ఎనిమిది సంవత్సరముల ప్రాయమునాడు, నారాయణరావు కలలో ‘దేశము’ ‘స్వరాజ్యము’ వినబడ్డది. తెల్లవారు మన దేశములోని ధనము కొల్లగొనుచున్నారను భావములు చొచ్చిరా నారంభించినవి. బెంగాలులోని యువకులు చేయుచున్న వానికంటె భయంకరమైన బాంబులు తయారుచేసి భరత ఖండము తప్ప, మిగిలిన దేశములను భస్మీపటల మొనరింపవలెనన్న తీవ్రేచ్ఛలతో నాతని హృదయ మావేశపూరితమైపోయినది. ఒకనాడాతడు ముఖముమీద ‘వందేమాతరం’ అని వ్రాసికొని, తోడి బాలురకుకూడ వ్రాసి, పాఠశాలకు వెళ్ళినాడట ! ఆనాడాతని తరగతి ఉపాధ్యాయుడు, వీరినందరిని బల్లమీద నిలుచుండ బెట్టి యా వ్రాత కడిగివేసికొన యాజ్ఞాపించెను. నారాయణరావు తన్నురిదీయవలెనేగాని మొగముమీద వ్రాత జెరపనన్నాడు. నారాయణుని తెలివి తేటలు, వినయ విధేయతలు, రూపసంపదయు నుపాధ్యాయులంద యనురాగమును జూరగొన్నను, ఆ నాడు నారాయణరావిచ్చు జవాబులచే నుపాధ్యాయులకు వెఱ్ఱియెత్తిపోయినది ‘మొదట నోరుముయ్యి! తర్వాత మొఖంమీద రాత చెరిపెయ్యి, లేకపోతే నీ వీపు చితకకొడతా!’ అన్నాడు ఉపాధ్యాయుడు.

‘మీరున్నూ తెల్లవాళ్ళ స్నేహితులే! మాకు స్వరాజ్యం కావాలి, అందుకని నేను చెరపను. వీళ్లెవ్వరూ చెరపరు’ అని జేవురించిన మొగముతో బాలకుడగు నారాయణరావు సింహదమనునివలె గర్జించినాడు.

ఆ ఉపాధ్యాయుడు తెల్లబోయినాడు. పేము బెత్తముదీసి రెండు దెబ్బలు వీపుమీద చురుక్కున జఱచినాడు. నారాయణరావు చెంగున బల్లపై నుండి యురుకుటయు, నుపాధ్యాయుని చేత నుండి బెత్తము లాగుకొని, ముక్కలు ముక్కలుగా విరిచి పారవేయుటయు, గనుమూసి తెరచునంతలో జరిగినది. బాలకులందరిలో పొడగరియై, చక్కని దేహ సౌష్టవముగల నారాయణరావు మోమున నపుడు వెలుగు నపూర్వ తేజము గాంచి ఉపాధ్యాయుల వారు భయకంపిత హృదయులై, మోము వెల్లనైపోవ, మ్రాన్పడిపోయినారు. బాలకులు భయాశ్చర్యములతో, ఏమి జరుగునోయని తేరిపార జూచుచుండిరి..

నారాయణరావు ‘రండఱ్ఱా! వందేమాతరం’ అని కేక వేసి వీధిలోనికి దారితీయ, బాలకు లాతని వెనుక ‘వందేమాతర’ మని కేకలు వేయుచు వీధిని బడిరి.

ఆరాత్రి, సుబ్బారాయుడు గారు పుత్రుని బిలిచి యంతయు దెలిసికొని కోపగించిరి. ఉపాధ్యాయుడు నారాయణరావును సమీపించి ‘నాయనా నేను పిల్లలుగల వాణ్ణి. నీకిట్టిపనులు సేయుట కెవరు బోధించారో నాకు తెలియదు. నా ఉద్యోగ మూడబీకి వేస్తారు. తిండికి గుడ్డకు దూరమై ముష్టి చెంబు చేతికి వస్తుం’దని నీళ్ళు తిరుగు కళ్ళు తుడుచుకొనుచు వక్కాణించినాడు. నారాయణరావుకును గనుల నీరుతిరిగినది. అప్పటినుంచి పాఠశాలలో నాత డెప్పుడట్టిపనులొనరింప లేదు.