పుట:Narayana Rao Novel.djvu/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంబంధనిశ్చయము

383

వందలు ఎన్ని సార్లడిగినను తీర్చలేకపోయినాడు. వారాతని జమీసంగతులు కనుగొని ముందుగా మేల్కొనుట మంచిదని, యాతనిపై సిటీ స్మాల్ కాజ్ కోర్టు (చిన్న న్యాయస్థానము) లో నభియోగము దెచ్చి డిక్రీపొందినారు. అప్పటికీ జగన్మోహనుడు లెక్క చేయలేదు. తన్ను నిర్బంధించగనే జగన్మోహనుడు తెల్లబోయినాడు. అప్పుడాతడు కారుమీద స్పెన్సరుహోటలునుండి జార్జిటవునులో విశాఖపట్నమునుంచి వచ్చిన డయానా యుండు మేడకు బోవుచుండెను. సూర్ చంద్ కంపెనీ వారి యుద్యోగి యొక్క మోటారు స్పెన్సరుహోటలు బయట న్యాయస్థానోద్యోగితో సిద్దముగానుండెను. శ్రీ జగన్మోహనరాయ బహద్దరు జమీందారుడు అద్దెకారు నెక్కిపోవుచుండ, దారిలో రౌండుటానా దగ్గర కారాగినది. వెనుకనే వచ్చుచున్న కారులో న్యాయస్థానోద్యోగివచ్చి నిర్బంధపు టుత్తరువు చూపించుటయు, జగన్మోహనరావు తెల్లబోయినాడు. అతనికి వెఱ్ఱికోపము వచ్చినది. సిగ్గుచే ప్రాణము చచ్చిపోయినది. పదిమందియు చుట్టును మూగినారు. ఆ సమయముననే నారాయణరావు ట్రిప్లికేనులో శ్యామసుందరితో మాట్లాడి యాలోచించుకొనుచు కారుమీద పోవుచున్నాడు. ఆ క్షణముననే పోలీసువారును ఇతరులును రెండుకారులు చుట్టు మూగియుండుటజూచి, ‘ఒక జమీందారుని బాకీకి అరెస్టు చేశారు’ అని ప్రజలనుకొనుమాటలు విని, కారాపు చేసి తా నా జమీందారుడు జగన్మోహనుడై యుండనోపునని గ్రహించి, చటుక్కున నక్కడికేగి యేమి సమాచారమని యడిగినాడు.

సంగతులన్నియు విశదముగా, నా యుద్యోగితో తాను మాట్లాడి అప్పు ధనమెంతయో తెలిసికొని తనకడ నా ధనము లేనందున హిందూస్థానీ బ్యాంకీకి చెక్కు నిచ్చెదనన్నాడు. సూర్ చంద్ కంపెనీ మనుష్యుడు నారాయణరావు గారి చెక్కు పుచ్చుకొని రశీదిచ్చెను.

ఎవరిదారినవారు వెడలిపోయిరి. జగన్మోహనుడు నిస్తబ్ధుడై, యేమి ఈ రాక్షసు డిట్లు చేసినాడు! అతనికడనే ధనమున్నదా? తనదగ్గర లేదా? తన్నవమానము చేయ నిట్లు చేసినాడు. తన కర్మము కాకపోయిన తనకీ నిర్బంధమును, నారాయణరావువలన నింత యవమానమును రానేల? నేడే ఆ ధన మెచ్చటనేని ప్రోగుచేసి నారాయణరావునకు పంపి వేయవలెను. వీడు వట్టి పంది. పంది గనుకనే భార్యయొక్క ప్రేమ చూరగొనలేకపోయినాడు. తనకెన్నో పనులుండి తీరుబడి లేకపోయినది కాని, శారద తన కౌగిలింతలకై యెదురుచూచు చుండవలసినదేకద యీపాటికి. సరే, వీడు తన్న వమానపరచినందులకు, వీని భార్యను పూర్తిగా వశముచేసికొనవలయును. తనకు వివాహమై నప్పటినుండియు ఆ విషయమున శ్రద్ధకలిగినదికాదు. తన మేనత్తగారి యింటికి కీలుపాకు వెళ్ళి, ఎవరెవ రెచ్చట నున్నారో తెలిసికొనవలయును. ఈమధ్య మేనత్తయు నామె భర్తయు కూనూరునుండి వచ్చెదరని తన తల్లికి తన మేనత్త వ్రాసినదికదా. అవును. శారద ఇక్కడనే యున్నదన్నారు. సరే తాను విశాఖపట్టణము వెళ్ళక పూర్వము శారదను గూర్చి కనుగొనవలయును.