పుట:Narayana Rao Novel.djvu/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

348

నారాయణరావు

‘ఎల్లాగా అసలునిర్గుణంలోంచి మూలప్రకృతీ, అందులోనుండి త్రిగుణాలు పుట్టినవి. అందునుండి మహత్తత్వము, మహత్తత్త్వాన్నుంచి అహంకారము, అహంకారములోనుంచి శబ్ద స్పర్శ రూప రస గంధాదులనే పంచభూతాలు, ఆ పంచభూతాల అన్యోన్య సమ్మేళనంవల్ల సమస్త జగత్తేర్పడింది.

౧౪

ఒపెరా

లక్ష్మీపతియు, నారాయణరావును ఆరాత్రి సూరీడును, శారదను తీసికొని ఎల్ఫిన్ స్టన్ కంపెనీకి ఇంగ్లీషునాట్యము చూడవెళ్ళిరి. పరమేశ్వరుడు, ఆలం, రాఘవరాజు, రాజారావులు నాటకమందిరముకడ గలిసికొనిరి. నారాయణరావు పదిరూపాయల తరగతి టిక్కెట్లు ఇదివరకే కొనియుంచెను. పరుపుల కుర్చీలపై లక్మీపతిని తర్వాత సూరీడును, శారదను కూర్చుండబెట్టిరి. మిత్రులు తా మాసీను లగుటలో నారాయణరావుకు శారద ప్రక్కకుర్చీ మిగులునట్లు చేసిరి.

నారాయణరావునకు శారదకుగూడ హృదయములు ఝల్లుమన్నవి. ఆమె మోము ప్రఫుల్లమగుట నా చీకటిలో నెవరు కనుగొనగలరు?

నాట్యము మొదలుపెట్టినారు. ఆ నాట్య మొక నాటకమువలె నున్నది. కథానాయిక నాట్యము చేయుచు బ్రవేశించెను. కథానాయకుడు నాట్యము చేసెను. కథానాయికతో నిరువదిమంది, కథానాయకునితో పదిమంది నాట్యముచేయు వనితలు బ్రవేశించిరి.

‘గమ్మత్తుగమ్మత్తు దుస్తులురా, ఏమి చిత్రంగా ఉన్నారురా మనుష్యులు!’ అని లక్ష్మీపతి అన్నాడు.

దిసమొల అయినట్లుగా వేషాలు. అందరు ఒకటే దుస్తులు, ఒకటేరీతి నాట్యం. కథానాయిక మాత్రం ముందునుండి, వెనుక హంగుచేయు సకియలకన్న నెక్కువగ నృత్యము చేయును. ముందునకువచ్చి పాటపాడును.

అంకము మొదలు చివరవరకు ఒకటే నాట్యము, పాటలు.

అలంకారములు అద్భుతములు. దుస్తులు నిరుపమానములు. ఆ నటీమణుల యందము హృదయసంచలన కారణము.

కథాభాగము తక్కువ, నాట్య మెక్కువ. మగవారిలో పాట పాడెడు వారి గొంతుకలు సముద్రఘోషానురూపములు. ఎంత స్థాయికైనను పోగలవు. ఆడవారి గొంతుకలు కిన్నరీసదృశములు.

నాటకము జరుగునప్పుడు శారద తన చేతిని పొరపాటున భర్త చేతిపై వైచినది. భర్తచేయి యని తెలిసెను. ఆ స్పర్శసుఖాన చేయి మరల తీసికొనలేక పోయినది. భర్త గమనించలేదని యనుకొన్నంతకాల మట్లనేయుంచినది. మధుర