పుట:Narayana Rao Novel.djvu/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాంతబోధ

347

శకుంతల విరగబడి నవ్వింది. ఇక్కడ మా పక్షంవా ళ్ళెవరూ లేరు. మా వాదం ఓడిపోయింది’ అని అన్నది. శారద చిరునవ్వు నవ్వుచు, సూర్యకాంతముతోబాటు అత్తగార్లకీ వదినగార్లకి తమలపాకులు చుట్టలు చుట్టుచున్నది.

ఇంతలో రోహిణి, సరళ, నళిని, వారి తల్లియు లోనికి వచ్చినారు.

శ్యామసుందరికి పరీక్ష లగుచున్నవి.

లక్ష్మీనరసమ్మగారికి కులములేని యీ బ్రహ్మసమాజం పిల్లలు తనయింటికి వచ్చుట యిష్టములేదు. ఇంతవరకు ఎదిగి పెళ్ళికాకుండా ఆ పిల్లలు చదువుకొనుచున్నారనియు, ముత్తయిదువవలె కనబడు వారితల్లి రెండుసార్లు వైధవ్య మనుభవించినదనియు తెలియగనే, యీ ప్రపంచమంతయు నెచ్చటకు పోవుచున్నదోయని యామె హృదయము గడగడలాడినది. నారాయణు డిట్టివారితో సహవాసము చేయుట, కులము పోగొట్టుకొనుటకే. ఈ పట్టణవాసాలలో ఇంతేకదా, యనుకొన్నది.

పెత్తల్లి హృదయములోని ఆలోచన గ్రహించి, వెంకాయమ్మ ‘అక్కయ్యా! రెండు కందర్థాలు పాడవే’ యనెను.

లక్ష్మీనరసమ్మగారు సరేయనుచు, శ్రావ్యమగు గొంతుకనెత్తి,

అన్నపు సూక్ష్మాంశము మన సెన్నగ
నీరంబు ప్రాణ మెఱుగుము,
రెండెన్నడు కలియవో, నాడే సున్న
సుమీ యెఱుక మా సుగుణసంపన్నా
కలియుట యెఱుకసుమీ యింతకన్నా
ఉన్న దెఱుక మూలమన్నదె వినలేదు.
ఎప్పడు నీ భ్రాంతి నిన్నంటనియ్యకు సుగుణసంపన్నా
కలియుటే యెఱుకసుమి యింతకన్నా౹౹

‘గురువు శిష్యుణ్ణిచూచి అంటున్నాడు. అన్నముయొక్క సూక్ష్మాంశమే మనస్సు, నీళ్లయొక్క సూక్ష్మాంశము ప్రాణము. ఈ రెండూ కూడితే యెఱుక. ఈ రెండూ కూడకపోతే అప్పుడే యెఱుకలేదన్నమాట అని.’

వెంకా: అన్నము యెలా మనస్సవుతుంది?

లక్ష్మీ: ఆరగించిన అన్నం ఏడుదినాల్లో రసమున్ను, అది క్రమంగా రుధిరము, మాంసము, మెదడు, అస్థి, మజ్జ, శుక్ల, శోణితములు అగును. వాటి కలయిక వల్ల పిండం అవుతుంది. పిండంలో మనస్సు చేరుతుంది. అంత ప్రాణము చేరుతుంది. అన్నములో ఉన్న ఎనిమిదోవంతు ఆకాశము, ఎనిమిదోవంతు వాయువు కలిసి మనస్సు ఏర్పడుతుంది.

‘ఇక ప్రాణం ఎనిమిదోవంతు, వాయువు ఎనిమిదోవంతు. మనం త్రాగే జలంలో వాయువు కూడా ఉంది.