పుట:Narayana Rao Novel.djvu/335

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
334
నారాయణరావు

మత్తుమం దక్కర లేదన్నారు. కాని రంగాచార్యులు గారు చాల జాగ్రత్తగల వైద్యుడు. చేతినెల్ల నిజముగా రాతివలె మొద్దుచేయుటకు తగినట్లు కండలలోనికి పిచ్చికారీ మందిచ్చి చేయిని బండచేసి కత్తులు మొదలయినవి సిద్ధము చేసికొని శస్త్రచికిత్స చేసినాడు. చిటికెనవ్రేలంతయు దీసివేయబడినది. సార్ కోమా సంబంధమగు వ్రణచిహ్నము లేమియు లేకుండచేసి యంతయు శుభ్రము చేసి రక్తము నష్టముగాకుండ రక్తనాళములుకుట్టి రంగాచార్యులు గారు చర్మముకూడ కుట్టివేసినారు.

ఆరోజంతయు సుబ్బారాయుడుగా రక్కడనే యుండిరి. మరునాడు సాయంకాలము మోటారుకారుమీద నారాయణరావు గారి యింటికి తీసికొని వచ్చినారు వారిని.

ప్రతిదినము వచ్చి రంగాచారి గారు కట్టు కట్టుచుండిరి. నాలుగురోజులైన వెనుక, ఆయనకడనున్న సహాయ వైద్యయువకుడు కట్టు కట్టుచుండెను. రంగాచారిగారు లోపలికి మంచిమందు లిచ్చుచుండిరి. సుబ్బారాయుడుగా రొక పదునైదు దినము లుండినవెనుక కొత్తపేట గ్రామము వెళ్లవచ్చునని రంగాచారి గారన్నారు.

సుబ్బారాయుడుగారిని జూచుటకు జమిందారుగారును, శారదయు చెన్నపట్టణము వచ్చినారు. సుబ్బారాయుడు గారు, వియ్యంకుడు నవ్వుకొనుచు వేళాకోళములు సలుపుకొనిరి.

జమీ: ఏమండీ బావగారూ! మేరుపర్వతానికి పిడుగు తగిలిందట?

సుబ్బా: ఒక వేలు కొట్టేసిపోయింది వజ్రాయుధం.

జమీ: అమృతం ఎత్తుకుపోయే గరుడుణ్ణి ఆపుచేద్దామని ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే ఒక రెక్కయీక ఊడిపోయిందట గరుడుడికి. మీరేమన్నా అమృతం ఎత్తుకురాలేదుగదా బావ గారూ!

సుబ్బా: ఎల్లాచూసినా ఇంద్రుడే కనబడ్డాడు. బావగారికి పుక్కిటి పురాణాలు అన్నీ తెలుసునే!

జమీ: అదేమిటండోయి దెబ్బకొడ్తున్నారు! నాకు పురాణాలు రావని వ్యంగ్యము ఏమి లేదుకద?

సుబ్బా: జమీందారులు, శాసనసభలో సభ్యులు పుక్కిటి పురాణాలకు తీరుబడి ఉంటుందా అని అన్నాను బావగారూ!

జమీ: బావగారిబోటి పెద్దలు వెళ్ళండి అంటే వెళ్లాను. మీబోటి వారి తరఫున ప్రతినిధినేగా? మేము జమీందారులము, మీరు జమీందారులకు ప్రభువులు.

సుబ్బా: ఎల్లాగయినా బావగారిమాట పైనే.

జమీ: ఎప్పుడూ మీ చెయ్యే పైన.