పుట:Narayana Rao Novel.djvu/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శస్త్రచికిత్స

333

లోనే సుబ్బారాయుడుగారి నుంచి, నారాయణరావుగారి యింటికి వెడలిపోవచ్చునని రంగాచారి గారు చెప్పినారు.

మరునాటి ఉదయము మెయిలుకు సూర్యకాంతము, నారాయణరావు కారుమీద సెంట్రలు స్టేషనుకడకు వచ్చినారు. రెండుమూడు కిరాయి మోటారులనుగూడ కుదిర్చియుంచినాడు. మెయిలువచ్చి యాగినది. ఒక రెండవతరగతి బండియంతయు నద్దెకు బుచ్చుకొని శ్రీరామమూర్తి, రాజారావు, యజ్ఞనారాయణశాస్త్రి, వెంకాయమ్మ, రమణమ్మ, జానకమ్మ గారును, లక్ష్మీపతితల్లి శేషమ్మ గారు, లక్ష్మీనరసమ్మగారు మెయిలులో సుబ్బారాయుడు గారితో దిగిరి.

సుబ్బారాయుడుగారి కుడిచేయి కట్టబడియున్నది. ఆయన బాధ నణచుకొనుచు మధ్యమధ్య బొమలు ముడుచుకొనుచు, బెద్ద కుమారుని బాసట గొని రైలుదిగి బాధతో నిండియున్న చిరునవ్వు చిన్నకుమారునిపై ప్రసరించెను. అతడు దెచ్చికోలు ధైర్యము మోమునదోప, తండ్రికడకువచ్చి, ‘ఎల్లాఉంది నాన్నగారూ?’ అని ప్రశ్నించెను. ‘బాధగా ఉంది. ఫరవాలేదులే. ఇదిగో సూరీడు వచ్చింది! ఏమీ లేదు తల్లీ. ఏదో చిన్నకురుపు, కణుపుజెష్టో లేక ఏదైన మాదో!’ అని సుబ్బారాయుడుగా రనిరి.

తిన్నగా పరీక్షచేసి ఇది శస్త్రము చేయవలెనని రంగాచారి గారు నిర్ణయించినారు. చిటికెనవ్రేలిపై ఒక చిన్న పుట్టుమచ్చయు, మచ్చపైన కాయయు నుండెడిదట. అది చటుక్కున పదిరోజుల క్రిందట పెద్దదికానారంభించి పోటును, బాధయు మొదలుపెట్టినది. చేయి వాచినది. సుబ్బారాయుడు గారికి తిండి సహించుటలేదన్నారు. సుబ్బారాయుడుగా రిది యేమియని, అమలాపురము పెద్ద కుమారునికి కబురంపిరి. శ్రీరామమూర్తి రాజారావును తీసికొనివచ్చెను. రాజారావుమాత్రము పరీక్షించి మధువు లేదనియు, మూత్రములో నితరమగు జబ్బేమియు లేదనియు, ఆ వ్రణము దుష్టవ్రణజాతీయనియు నిశ్చయించెను. కండరములలో పెరుగు సార్ కోమా యను వ్రణమట. అది పెరుగుటవలన వ్రణము పుట్టినచోటనేగాక రక్తములోనుంచి విషము ప్రవహించి వ్రణము కండరములు, నరములు, రక్తధమనులు, చెడురక్తపు నాళములు పాడుచేసికొనుచు విజృంభించి ప్రాణమునకు మొప్పముకూడ తెచ్చునని రాజారావు శ్రీరామమూర్తితో జెప్పి, అందుకు వ్రేలు కొట్టి వేయవలసియుండు నేమో యనియు, చెన్నపట్టణము డాక్టరు రంగాచార్యులుగారి కడకు వెళ్లుట యుత్తమమనియు సలహా చెప్పెను. తాను కొంత మందు లోనికిచ్చి, కట్లు గట్టి చెన్నపట్టణమున కారాత్రి మెయిలులో బయలు దేరుటకు నిశ్చయించి నారాయణరావునకు తంతినిచ్చెను.

రంగాచార్యులు గారు రాజారావు చెప్పినట్లుగానే యెంచి చిటికెన వ్రేలు మొదలంట కొట్టివేయవలెనని నిర్ధారణ చేసెను. సుబ్బారాయుడు గారు