పుట:Narayana Rao Novel.djvu/320

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
319
ప్రేమాశయము

‘రాజేశ్వరరావుతో ఒక దినమంతయు ధర్మజిజ్ఞాస చేశానురా! వాడి దృష్ట్యా చూస్తే న్యాయపథంగానే ఉంటుంది వాడి నడత. వాడెంత సేపు చెప్పినా ‘నాకు మా వివాహధర్మములందు నమ్మకము లేదు. పుష్పశీల నన్ను ప్రేమించింది, నేనామెను ప్రేమిస్తున్నాను. ఆవిడకు నామీద ఇష్టంపోతే ఆవిడ యిష్టంవచ్చినచోటికి వెళ్లవచ్చును. నేనెప్పుడూ ఏవిధమైన అభ్యంతరం పెట్టను. నీ వేదాంతం నా కవసరం లేదు. నీ ధర్మం, నీ అహింస, నీ సత్యమార్గం నాకు పథ్యం కాదు. నాకు అర్థం కాదు. నువ్వు నీ బోధ పుష్పశీలకు చేసుకో. ఆ అమ్మాయి మనస్సు మళ్లుతుందీ, తీసుకుని వెళ్లి ఆ భర్తకే అంటగట్టవోయి. ఇది మాత్రం నేను నిర్ధారణగా చెప్పగలను. పుష్పశీల సంపూర్ణంగా నన్ను ప్రేమిస్తోంది. సర్వకాలం ఆమెకు నామీదే ఉంటుందని చెప్పను. ప్రేమకూడా నువ్వు చెప్పే బ్రహ్మపదార్థంలా నిత్యమని చెప్పటం మామతమేకాదు!’ అన్నాడు. నేను, ఆ అమ్మాయితో ఒంటిగా ధర్మమార్గం అంతా చెప్పినాను. ఆ అమ్మాయి విన్నదంతా విని నవ్వుతూ ‘నారాయణరావు అన్నగారూ! మీరంటే చాలా గొప్పగా చెబుతారు నాయుడుగారు. కాని చూస్తే మీరు వట్టి ముసలమ్మ కబుర్లు చెబుతున్నారు’ అన్నది. నేను మాత్రం తెల్ల బోయినాను’

‘ఏమి చెప్పావురా రాజేశ్వరుడితో?’

‘ఏముందిరా! నీ వృత్తిలో సర్వసృష్టిన్ని పరబ్రహ్మైక్యం చేయడమే మహాత్ముల దృష్ట్యా ఉన్నతాశయం అన్నాను. కాబట్టి అందరూ ఒక్కసారే మోక్షం పొందినా ఇబ్బందిలేదురా అన్నాను. మనం చేసే పనులు రెండువిధాల ఆలోచించాలి. నివృత్తికోసం, ప్రవృత్తికోసం. అంటే మోక్షమార్గం క్రిందా, ప్రపంచంలో ఆనందం పొందడం క్రిందా. నువ్వు చేసినపని ఎందులోకి వస్తుందన్నాను.

‘నాకు ఇప్పుడు ఆనందం ఇస్తోందిగా!’ అన్నాడు.

‘అదేనా నువ్వుచేసే ప్రతికార్యం ఆలోచించుకోవలసిన పద్ధతి? ఏ కార్యం చేసినా దాని మంచి చెడుగులు నీ జీవితం అంతా ఎలా ఉపకరిస్తాయి, ఎలా అపకారం చేస్తాయి అని ఆలోచించుకోవుట్రా’ అన్నాను.

‘ఇప్పు డీ అమ్మాయి నువ్వూ ఉన్నారుకదా, ఆ భర్త నీపై శిక్షాస్మృతి క్రింద కేసు తెస్తాడనుకో. నువ్వు ఏ రెండేళ్లో జైలుకు వెళ్లవచ్చుకదా?’ అన్నాను.

‘అవును. నువ్వు నీ అహింసమార్గం అవలంబిస్తూ జైలుకు యెందుకు వెళ్లావు? నా ఆశయంకోసం జైలుకు వెళ్లితే తప్పా?’ అన్నాడు.

‘మనం చేసే ప్రతికార్యం దోషరహితంగా ఉండదు. ‘సాధ్యమైనంత వరకు’ అనే మాట ఒకటుందికదా. అలాగే నువ్వు ఆచరించే కార్యాలలో సాధ్యమైనంత వరకు ఇతరులకు కష్టంగా ఉండకూడదు అని కూడా చూడాలి కదా’ అని నేనంటే,