పుట:Narayana Rao Novel.djvu/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

నారాయణరావు

‘చూడాలి కాని సంఘం ఒక దోషం చేస్తూంటే అది మార్చడానికి ప్రయత్నం చేసేటప్పుడు కొందరికి అపకారాలు జరుగుతాయి. నీ అహింసావ్రతంవల్ల ఎంతమందికో నష్టం కలుగవచ్చును. అంతమాత్రాన మానుతావా?’ అని నన్ను ప్రశ్నించాడు.

‘సరే, అంతవరకు వచ్చావు గనుక నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్ప. ప్రపంచంలో ఉత్కృష్ట ఆశయం ఏది?’ అంటే , ‘సంతోషమే ఉత్కృష్ట ఆశయ’ మన్నాడు.

‘సంపూర్ణమైన, సర్వతోముఖమైన సంతోషం ఏరకమైన స్త్రీ, పురుష సంబంధములో లభిస్తుంది? అనే ప్రశ్నకు, ‘ఇంతవరకు లేదు. ముందుముందు మా పద్ధతివల్ల లభించగల’ దని చెప్పాడు.

‘జడ్జి లిండిసే గారి వ్రాతలు, సర్ హావిలాక్ ఎల్లిస్ మొదలగు వైద్య విశారదుల వ్రాతలు చదివావా?’ అన్నాను.

‘అవన్నీ గమనించి వివాహశాసనం ఉన్న మనదేశంలో స్త్రీ, పురుషులకు అంతకంటె ప్రాపంచినందం ఎక్కువగా కలగటం లేదని చెప్పగలవా?’ అన్నాను. ‘అమెరికాలోని పద్ధతులు ఎంత నికృష్టంగా ఉన్నా లిండిసే కనబరచిన దోషాలకు అతడు చూపినది నివారణోపాయంకాదు’ అన్నాడు. షెల్లీ మొదలగువారు మీ పద్ధతులు అవలంబించి భగ్నమనోరథులై కృశించి కృంగిపోయారు. ఇంక ప్రకృతిశాస్త్రజ్ఞులు శాస్త్ర పరిశోధన చేస్తూ చేస్తూ ప్రకృత్యతీతమగు పరబ్రహ్మకు మార్గము చూపు దారికి వచ్చి యచ్చట ఆగిపోయినారు. ప్రకృతి సంబంధమగు పరీక్ష చేయడానికి పనికివచ్చే పరికరాలు పరబ్రహ్మమును కనిపెట్టలేవు. ప్రకృతిమార్గం చేత పరానికి దారి దొరకదు. దానికి పార లౌకికంగా ఆలోచించాలికదా. పారలౌకికంగా ఆలోచిస్తేనే మీదనున్న దారి కనపడుతుంది అంటూ ఈలాగున చెప్పాను. వాడు తల వాల్చుకొని ఉన్నాడురా. ఆ పిల్ల కూడా చెంతనే ఉన్నది. ఇంతా విని ఆ అమ్మాయి అన్నదికదా, ‘నారాయణరావు అన్న గారూ! నా జన్మలో నేను మనుష్యస్త్రీగా సంచరించింది ఈరోజులే. మీరెంత చెప్పినా లాభంలేదు’ అన్నది. సరే, బాగా ఆలోచించుకోండి, అని బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాను. రాజేశ్వరునితో ఆ అమ్మాయి భర్త వచ్చినాడని చెప్పినాను. అత ‘డల్లాగా’ అని అతన్ని కూడా వచ్చి భార్య హృదయం మార్చడానికి ప్రయత్నించమనరా’ అన్నాడు. నాకు నవ్వువచ్చింది. ఇంతలో నువ్వు పంపించిన భయంకరమైన టెలిగ్రాము చక్కా వచ్చింది.’

చెన్నపట్నం వచ్చుటతోడ నే నారాయణరావుగారి ఇంటిలో సూరీడు, శ్యామసుందరి, ఆమె ముగ్గురు చెల్లెళ్లు అందరూ కూర్చొనిఉండగా నారాయణరావు, రాజారావు భార్య పోయిన సంగతి చెప్పి, సూరమాంబ గుణగణములను వర్ణించి చెప్పినాడు. శ్యామసుందరి వివర్ణవదనయై విన్నది.

‘అన్నా! మంచి వాళ్లు బ్రతుకరుగదా!’