పుట:Narayana Rao Novel.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

నా రా య ణ రా వు


‘తప్పక సంబంధం నిశ్చయం అవుతుంది. నువ్వు వివాహానికి నీ భార్యతో రావాలి. అమ్మ గారినీ నాన్న గారినీ అన్న దమ్ములను బావ గారిని చెల్లెలిని నువ్వు నాకోసం బలవంత పెట్టి తీనుకు రాగలిగితే నీకు నేనేమివ్వగలను రా ? తలుపు దగ్గర పాట నిన్ను పాడనిస్తా.

‘సర్వకాలాలా ఆ బాలిక నాకు ప్రత్యక్షమవుతోంది. నన్ను ఒక విచిత్రానందం అలుముకుపోయినట్లుగా ఉన్నదోయీ!

‘ఇల్లా ఉండగా ఒక భయము నన్ను ఆవేశించింది. మా వ్యాపారములు చాలా బాగానే ఉన్నాయి. మేమూ కొంచెం భాగ్యవంతులమనే చెప్పాలి కదా! అయినప్పటికీ బాలిక జమిందారీ కుటుంబంలో జన్మించింది. రాజ భోగములో పెరిగింది. రాచఠీవి ఆమెలో పుంజీభవించి ఉంటుంది. ఉంటే యీ సామాన్య సంసారంతో ఆమె కలయిక మా జీవితాలకి విషాదాంతం అవుతుందేమో!

‘అంటే ఈ వివాహంవల్ల నాకూ నా కుటుంబానికి ఎడబాట్లయ్యే విధి వ్రాత తటస్థిస్తే నాకు జన్మాంతం తీరని వ్యధే కదా! పోనీ మా అన్నయ్యకిమల్లే నేనున్నూ ఉద్యోగంరీత్యా పర దేశంలో ఉంటానుగనుక పరవా లేదు అనుకుందాం (అల్లా అని అనుకోవడం నాకు చాలా కష్టంగా తోచినది). అయినా ఆ బాలిక నన్ను ప్రేమించక రాచపట్టిననే గర్వంలో మునిగి ఉండేందుకు ఎక్కువ సావకాశాలుంటవనుకో! అప్పుడు నా బ్రతుకు శూన్యమవుతుంది. ఆలోచన చేయలేకుండా ఉన్నానురా పరమం.

‘ఈ పిచ్చి ఉత్తరాన్ని చూసి నన్ను పిచ్చివాణ్ణి అనుకున్నా సరే! ఈ సందర్భంలో నువ్వు దగ్గర లేకపోవడం, నాలోని చైతన్యం మాయమైనట్టుగా ఉంది. నువ్వూ ఇప్పుడే కొత్తగా చేరుకొన్నావు నీ సంసారాన్ని . ఇంతలోనే మళ్ళీ వానప్రస్థాశ్రమం స్వీకరించరా అని ఎట్లా అన్ను? జాగ్రత్తగా ఆలోచించి జవాబురాయి. డాకుదొరకి కాకినాడ రాశాను. మా యిద్దరే నా కేడుగడలు.

‘ప్రేమనేది నిజమేననిన్నీ, అది పుస్తకాల్లో మాత్రం ఉండే వట్టి బూటకమనేవారి వాదన అనుభవరహితమనిన్నీ మనం ఇదివరకే అనుకున్నాం. అట్లాంటి ప్రేమ నన్నిప్పు డావరించుకుందోయి. ఆ బాలిక నా హృదయాన్ని కాలుడు సత్యవంతుని జీవాన్ని బొమ్మలో లాగుతున్నట్లు లాగివేసిందిరా! అది నిజమైన ప్రేమకావచ్చును; లేక వట్టి వాంఛేనా కావచ్చును. కాని ఆ బాలికను నేను కరగ్రహణం చేయనినాడు నాజన్మ ఎడారి అని భావించుకుంటున్నా, ఏమో! ఆమెను చూడ్డానికి వెళ్లనిమునుపు పిల్ల తెల్లగా పాలిపోయి ప్రాణం లేకుండ క్షయరోగం పట్టి పీడించేవ్యక్తి లాగు, ఈదురో అంటూ ఉంటుందనిన్నీ, ఏదో కాస్త సంగీతం, కాస్తన్నర ఇంగ్లీషు, అరకాస్త తెలుగు, పరకకాస్త సంస్కృతం బలవంతంగా నేర్చిన చిలకల్లే ఉంటుందనిన్నీ, కన్ను, ముక్కు, గడ్డం విభేదం లేకుండా ఉండే మూర్తి అయివుంటుందనిన్నీ, మా బావా,