పుట:Narayana Rao Novel.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఔ నా, కా దా

31


నేనూ అనుకున్నాం. కాని, ఆమె మానవ బాలిక కాదురా, మన్మథ సృష్టిరా! సరస్వతి సపత్నిరా!

‘ఏమి సంగీతం, ఏమి మాధుర్యం! ఆమె మూర్తి దాల్చిన కళాధిదేవతంటే నమ్ము. మేము అక్కడ కరిగిపోయాము. లోకోత్తరుడగు శ్రీరామయ్య గారి ఆంతరంగిక శిష్యురాలనని ఫిడేలు వాయిద్యంలో చాటుకుందిరా.

‘మా బావ, భాషలు తదితర పాండిత్యం సానపైపెట్టి ఒరచిచూచాడు.

‘ఆ బాలిక హృదయం చూరగొనాలి అని తన్మయుణ్ణయి, మతి చలించిన నాకు తీవ్రావేశం కలిగింది. ఆ బాలిక ఫిడేలు అందుకున్నాను. చెన్నపట్నంలో నేను నేర్చినవిద్య, వెంకటస్వామి నాయని మాధుర్యంతో, దక్షిణా పథాలు తిరిగి గమనించి హృదయస్థం గావించుకొన్న గోవిందస్వామిపిళ్ళే, చౌడయ్యల చమత్కృతులతో గుప్పేశాను సంగీతం వెన్నెల. ఆ రోజున ఎందుకైనా మంచిదని మహ అద్భుతంగా వేషం వేశాను. ఎలాంటి వస్త్రము అలంకరించానో నువ్వు ఊహించి ఉత్తరంలో రాయి.

‘మరి ఆ బాల నన్ను విస్తుబోయి చూసిందని నా అభిప్రాయం. మా బావ అభిప్రాయం అదే!

‘జవాబుకు ఎదురు చూస్తూ నువ్వు దగ్గర లేవని పరితపించే నీ నారాయుడు.’


౮ ( 8 )

‘ఔనా, కాదా?’


ఇంతలో లక్ష్మీపతి భార్య రమణమ్మ పిల్లవాని నెత్తుకొని బండి దిగినది. అన్నయ్య వచ్చాడూ! ఎంత సేపయింది అన్నయ్యా నువ్వు బండిదిగి? మందపల్లిలో వెంకట్రాయుడు మామయ్య గారి యింట్లో మాట్లాడుతూఉంటే పొద్దు పోయింది. ఇంతలో బాబు ఏడ్చాడు. నాలుగు వేడి మెతుకులు పెట్టి బయల్దేరాను. అత్తయ్య ఒకటే బలవంతం.’

‘బావా, నేనూ వస్తున్నామని అత్తయ్యతో చెప్పడానికి సిగ్గుపడ్డావేమిటి? ఇందాకటినుంచి ఇంకా రాలేదని బావ ఒకటే చూడ్డం గుమ్మం వైపు!’

‘నారాయణ గారూ, అల్లా చూసేరోజులు వచ్చాయి. నేను చూసే వాణ్ణో కాదో నీ హృదయానికి తెలవదురా వెఱ్ఱివాడా!’

‘ఇలా యివ్వవే బాచిగాణ్ణి! రాడేం? కొత్తవచ్చింది! ఏడుపు మొగం పెట్టాడు. మీ నాన్న వచ్చాడురా. సూరీడూ! బాచిగాడికి తెచ్చిన గిలకలు, బొమ్మలు ఇల్లా తేవే. ఇవిగోరా! ఆరీ నీ! లంచం యిస్తే వచ్చాడు. బావా వీడు ఓవర్ సీయర్ పని చేసేటట్టున్నాడోయి, అసాధ్యుడు. ఆ బూరా ఇయ్యి, నీ దగ్గరకు వస్తాడు. ఆ! వెళ్ళాడూ! వీడు తప్పకుండా, లంచగొండే! అచ్ఛా.’