పుట:Narayana Rao Novel.djvu/296

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
295
భర్తయే గురువు

నారాయణరావుకీ కొలది మాసములలో నెలకు రెండువందలు వచ్చు పనులు స్వయమైన కాతాలవలన నేర్పడినవి. గురువుగా రీతనిపని చూచి మెచ్చుకొని పెద్ద వ్యాపారములలో సహాయన్యాయవాదిగా పని చేసినందుకు నూరు, నూటయేబది యిప్పించుచుండిరి.

కోర్టుపని యగుటతోడనే యింటికివచ్చి, సూర్యకాంతమున కొకగంట చదువు చెప్పును. తరువాత స్నానముచేసి దుస్తులు ధరించుటతోడనే, యెవరో యొకరు స్నేహితులు వచ్చెదరు. వారిని తీసికొనియో, తానొంటిగనో కారులో విహారమునకుబోవును. వచ్చినప్పు డాతని స్నేహితుడగు పరమేశ్వరమూర్తి కూడ నుండువాడు. ఒక్కొక్కప్పుడు సూర్యకాంతమును, శారదను విహారమునకు కారుమీద బొమ్మని తాను నడచి సముద్రపుటొడ్డునకు బోవువాడు. నడచివెళ్ళి నప్పడుమాత్ర మతడు తిరిగివచ్చిన వెనుక మూడవసారి స్నానమాచరించువాడు.

శారద చెన్నపురికివచ్చిన పదిరోజులకు జమీందారుగారు కొమరితను జూచుటకు వచ్చిరి. శారద యత్తవారింటికి వెళ్ళునపుడు భర్త మేధాసంపన్నులగువారిలో మేధావి యనియు, నాతడే యామెకు జదువు చెప్పుననియు బోధించి పంపినాడు. కావున ‘నుపాధ్యాయుని బెట్టినా వెందుకు, నీవు చెప్పిన సరిపోవునుగదా’ అని జమీందారుగా రల్లుని బ్రశ్నించిరి.

‘నాకు సరిగా తీరుబడిలేదు. ఉన్నప్పుడల్లా చెపుతూ ఉంటానండి.’ ఆ ముక్కలనుట కాతని హృదయము తల్లడిల్లిపోయినది.

నారాయణరా వొకనాడు సూర్యకాంతముతో ‘మీ వదిననుకూడ చదువుకునేందుకు రమ్మని చెప్పమ్మా’ యని వచించెను. నూర్యకాంతముపోయి శారదను దీసికొనివచ్చినది.

శారద కత్తవారింటికి వచ్చుటకే యిష్టము లేక పోయినది. ఆమెకు భరింపరాని దుఃఖము వచ్చినది. తండ్రిమాట కెదురాడి యెరుగదు. తమ్ముడు కేశవచంద్రుడు ‘చిన్నక్కా! నువ్వన్నా వెళ్ళి బావను దీసుకురా’ యని కోరినప్ప డామెకు ఏవియో యాలోచనలు జనించి కన్నుల నీరు పొరలివచ్చినది, తల్లి కంటనీరు పెట్టుకొన్నది. మేనత్త విచారించినది. జమీందారుగారు తనయను చెంతజేర్చికొని ‘తల్లీ! స్త్రీలు జన్మము నెత్తినప్పుడే భర్తయింటికై నిర్దేశింప బడ్డారుకదా! నువ్వు చదువుకొన్నదానవు. నీ కొరులు చెప్పవలెనా! వెళ్ళమ్మా, నువ్వు చెన్నపట్టణములో ఉందువుకాని. మీ మామగారితో చెప్పాను. నేను ఎప్పడూ వస్తూ ఉంటాను. నువ్వు మార్చి ఆఖరువారంలో ఎలాగు ఇంటికి వస్తూనే ఉన్నావు. అక్కడ వాళ్ళ సూర్యకాంతము ఉండనే ఉండును. బావ సుందరరావు, అతని భార్య, పిల్లలూ వాళ్ళూ ఉంటారాయెను. అక్కయ్యను వచ్చి చూడమని వ్రాస్తున్నాను’ అని బుజ్జగించినారు.

ఏనాటికయిన అత్తవారింటికి, భర్తకడకు వెళ్ళక వలనుపడదని యామెకు తెలియును. భర్తతో గాపురము తప్పుటెట్లని యామె యాలోచించుకొనలేదు.