Jump to content

పుట:Narayana Rao Novel.djvu/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

నా రా య ణ రా వు

వారమురోజులు గడచిపోయినవి. తాను చెప్పుటమాట యటుండనిచ్చి, శారద పరీక్షలో గృతార్థురాలు గావలెననియు, జెల్లెలు సూర్యకాంతము ప్రవేశపరీక్షలో గృతార్థురాలు కావలెననియు సంకల్పించి, భాస్కరమూర్తి శాస్త్రులగారివంటి యొక విద్యాశేఖరుని, హిందూ ఉన్నత పాఠశాలలో పనిచేసి పింఛను బుచ్చుకొనుచున్న బి. ఏ., ఎల్. టి. ని, నెలకు ఏబది రూపాయలు వేతనమిచ్చి చదువుచెప్పుటకు కుదిర్చినాడు.

శ్యామసుందరీదేవియు, నామె చెల్లెళ్లును నారాయణరా వింటికి జూడ వచ్చినారు. వారందరు సీమరేగు, ద్రాక్ష, దానిమ్మ, అంజూరా మొదలగు ఫలములు; జీడి, పిస్త, బాదం మొదలగు పప్పులును; పటిక బెల్లమును, పసుపు కుంకుమమును, పట్టుచీరయు, రవికయు దీసికొనివచ్చినారు.

సూర్యకాంత మదివరకే శ్యామసుందరీదేవి యింటికి వెళ్లుచు వారితో బరమస్నేహమున మెలగుచుండెను. ‘శ్యామక్కా’ యని యొకసారి ‘డాక్టరక్కా’ యని మరియొకసారి సూర్యకాంత మామెను బిలుచుచుండును. ‘అందరము యెనమం డ్రక్కచెల్లెండ్ర’ మని యామె యనుచుండును. శ్యామసుందరి తల్లిని ‘పిన్నీ పిన్నీ’ యని పిలుచుచు ప్రాణమిచ్చు చుండునది.

నారాయణరావా నలుగు రక్కచెల్లెండ్రకు పుట్టినదినమని, పండుగలని పేరులు చెప్పి బొమ్మలు, చీరలు, రవికగుడ్డలు, వెండిసామానులు బహుమానముగ నిచ్చుచుండెను.

శారద వీరంద రెట్టిచుట్టములో యనుకొని సిగ్గుచేతను, గర్వముచేతను చాల ముభావముగ సంచరించినది. శ్యామసుందరి యది యంతయు సిగ్గనుకొని యామెతో సౌహార్థమున మాట్లాడినది. వారందరు ‘శారదవదినా! వదినా! చిట్టి వదినా! యని వివిధరీతుల బల్కరించిరి. ‘మా అత్తగారు కులాసాగా ఉన్నారమ్మా, వదినగారూ?’ అని నళిని యన్నది. ‘ఉన్నా’ రని శారద యుత్తర మిచ్చినది.

వారంద రామెను నెయ్యముమై వీడుకొని వెడలిపోయిరి.

శారదకు చెన్నపట్టణమున భర్తజీవితము విచిత్రముగ గనుపించినది. ఆతడు తెల్లవారుగట్ల దండెములు, బస్కీలు తీసి ముద్రలు తిప్పుచు శరీరవ్యాయామము చేయును. వ్యాయామము చేసిన గంట కాతడు చన్నీళ్లలో స్నానమాచరించి రెండు యిడ్లి పుచ్చుకొని, పాలు త్రాగి, సిగరెట్టు కాల్చుకొని, ఖద్దరు దుస్తులు ధరించి కచ్చేరిహాలులోనికి బోయి యచ్చట తన యప్పీళ్ళు మొదలగునవి చదువుకొనును. మామగారు షాహుకార్ల ఖాతాలుకొన్ని యిప్పించినారు. అన్నగారు పంపించిన యప్పీళ్ళు, శ్రీనివాసరావుగారు పంపినయప్పీళ్ళు, తండ్రిగారు వచ్చునట్లుచేసిన యప్పీళ్ళు, నారాయణరావుకు పుష్కలముగ పనియున్నది. అప్పీళ్ల విషయమైవచ్చిన పార్టీలతో సంప్రదించి, యచ్చట నుండి మోటారు మీద తన గురువగు వకీలు ఇంటికి బోవును. పదింటికి ఇంటికి తిరిగివచ్చి భోజనము చేసి దుస్తుల ధరించి తిన్నగ ఉన్నత న్యాయస్థానమునకు బోవుచుండును.