పుట:Narayana Rao Novel.djvu/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

నా రా య ణ రా వు

పర: కలకత్తాలో మేము నడిచి వెడుతూఉంటే, ఒక సార్జెంటు సైకిలు మీద వస్తూ నారాయుడికి తగిలి క్రిందపడ్డాడు. పడి ‘ఛండాలుడా’ అంటూ లేచి ‘నీబుర్ర బద్దలుకొడ్తాను’ అని మీదకు వచ్చాడు. నారాయుడు నవ్వుతూ నుంచొని మనిషి ఎప్పుడువచ్చి చేయెత్తి కొట్టబొయ్యాడో మెరుపువేగంలా ఆ చెయ్యి పట్టుకొని వాణ్ణి వెనక్కు తిప్పి చెయ్యిమెలిపెట్టి వదిలేసి ‘అనవసరంగా మీదకు రాకు. తప్పు దగ్గర ఉంచుకొని ఎగిరితే ఎవరూ భయపడరు పో’ అని తోవచూపాడు. దెయ్యంలా ఉన్న మనిషి పిల్లి అయ్యాడు. మాట్లాడక సైకిలు ఎక్కిపొయ్యాడు. అది చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి వచ్చి నారాయుడు చుట్టూ మూగారు.

రాజా: ఇదిగో వచ్చాడు నారాయణం, వెయ్యేళ్ళాయువు.

పర: అయితే త్రిదశవర్యుడవైపోరా నారాయుడూ!

నారా: (లోపలికి వచ్చుచు) ఆలస్యమయింది, క్షమించాలి. నళినీ, సరళా కన్యలలో ఎవరైనాసరే, యీ అన్నకు ఒక ఔన్సుడు మంచినీళ్లు ఇస్తే చాలా సంతోషిస్తాడు.

రాజా: మీ మామగారేమన్నారోయి?

నారా: ఉండు ఈదాహం తీర్చుకోనియ్యవయ్యా.

నళినీదేవి లోనికి పోయి మంచినీరు దీసికొనివచ్చి యిచ్చినది. నారాయణరావు దాహము దీర్చుకొని కూర్చుండెను. మంగపతిరావు నారాయణరావును జూచి ‘రేపు మాయన్న వచ్చుచున్నాడు’ అనెను. ‘ఏ అన్న?’ యని నారాయణరావు పృచ్ఛజేసెను.

‘మా రెండవ అన్నయ్య.’

పర, నారా: చాలా సంతోషము.

రాజా: మాకు శల్యవిద్యలో ద్వితీయోపాధ్యాయుడుగా ఉండేవారు.

శ్యామ: (నారాయణరావును జూచి) అన్నగారూ! నటరాజన్ మీ ఆంధ్రులు వట్టి ఢాంబికులు అని వాదించాడు. నాకు జ్ఞానం వచ్చినతర్వాతనే చెన్నపట్టణం వచ్చాము. కనుక నాకు ఆంధ్రుల చరిత్రా, వారి స్వభావాలూ యేమి తెలియవు. చిన్నతనంలో తెలుగుదేశంలోగూడ ఉన్నామట.

నారా: ఒకసారి మీరంతా మా దేశంవస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మా ఇంటికి కొత్తపేట అతిథులుగారండి. దేశం, దేశంలోని ఆచార వ్యవహారాలు, దేశం యొక్క వర్తమాన చరిత్ర అన్నీ జాగ్రత్తగా గ్రహించగలరు.

నళిని: మన ఆంధ్రుల్ని నటరాజన్ గారు చెక్కివదిలారు. మీరు దానికి సమాధానము చెప్పరేమండీ అన్నయ్యా!

పర: మన ఆంధ్రులకు ఉత్సాహం యెక్కువ. సమయం వచ్చిందంటే ఉత్సాహంతో వేలకువేలు జనము సిద్ధము. ఉత్సాహం తగ్గటంతోనే కనుచూపుమేర దూరాన్ని మళ్ళీ ఎవరూ కనబడరు.