పుట:Narayana Rao Novel.djvu/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామచంద్రుని విద్యార్థిదశ

257

పోయినారు. గణితాచార్యు డాత డన్న మంచి గౌరవము చేయును. ప్రేమమున నాతని ముంచెత్తును. అతనికి ఎం. ఎస్‌సి. బిరుదము నిచ్చుట కింకను ఆరు నెలలు వ్యవధియున్నది.

ఈ రెండేళ్ళలో రామచంద్రరావు, రౌనాల్డుసన్ దంపతులను దర్శించుటకు స్నేహితురాలగు లియొనారాతోగలిసి వెళ్ళుచుండును. రామచంద్రరావును లియొనారాయు హార్వర్డు విశ్వవిద్యాలయములోనే చదువుచుండుటచే వారమున కొకసారియైన గలసికొనుచుందురు. లియొనారా రామచంద్రరావుల స్నేహము నానాటికి వృద్ధినందినది.

లియొనారాకన్యక నెమ్మదిగా రామచంద్రునిపై సోదరునికన్న నెక్కువ ప్రేమము జూప నారంభించెను. అది పురుషుని వాంఛించు ప్రేమయని యామె గ్రహింపలేకపోయినది. రామచంద్రరావెన్ని విశేషములనో జెప్పువాడు. భరతదేశమును బొగడువాడు. వేదాంత సారమునుగూర్చి యేదియో మాట్లాడువాడు. ఆమె తన స్నేహితురాండ్రను గొనివచ్చి రామచంద్రరావునకు వారితో బరిచయము కలుగజేయుచుండునది. రామచంద్రరావునకు నాట్యము నేర్పుచు నాతనితో నత్యంత స్నేహమై వదలకుండునది.

‘రామ్, మా అమెరికను బాలకులవలె, మీ భారతీయు లాటలాడ రేమిటి?’

‘నారా! మీరు సంపూర్ణస్వతంత్రులు. అడుగడుగున మీ రగౌరవము పొంద నవసరములేదు. మీస్వాతంత్య్రము, మీ అభివృద్ధి, మీకున్న గౌరవము ప్రపంచముననే దేశమున కున్నది? స్వతంత్రములేనప్ప డమెరికాకున్న స్థితి యేమిటి? నేటికి నాటికి హస్తిమశకాంతరము భేదమున్నది. నేడు కెనడావలె నుండవలసిన దేశము, దేశము లన్నిటికన్న మిన్నయై, ప్రపంచమునకు షాహుకారై, యుద్ధపరిశ్రమలో ముందంజయై విజృంభించి, ముఖ్యమైన పరిశ్రమలకు వ్యవసాయములకు ప్రథమదేశమై యొప్పారుచున్నది. మీవలె మాకు ఇట్టి సంతోషకారణము లేదు. ఇది ఒకటి. రెండు, మా దేశములో ప్రబలిన మెట్ట వేదాంతము మమ్ము పురుషకారహీనులైనజడులను చేసివైచినది. మేము వెనుకటి వారమూ కాము, ఈ కాలములోనూ లేము.’

‘నువ్వు మాట్లాడినదంతా అధీరత సూచిస్తూ ఉన్నది. ఆంగ్లేయులు మీ దేశము ఆక్రమించడం ఉత్తమం అని నా అభిప్రాయం.’

‘అది నిజమే చెల్లీ! ఏ మహాచక్రవర్తి కాలంలోనో దేశం అంతా ఏకచ్ఛత్రాధిపత్యం క్రింద వచ్చినా, ఆ రాజు పోవడంతో, మళ్ళీ దేశం ముక్క లయ్యేది. అంటే దేశంలో సంయోగశక్తి కన్న వియోగశక్తి ఎక్కువ ఆవరించి యుండు స్థితికి వచ్చింది. కాని బలవంతులగు ఆంగ్లేయులు మా దేశం ఆక్రమించుకొనడంచే అన్ని ఉపజాతులవారము, అందరము ఒకటిఅయ్యాము, ఇంకా కావాలి. అంతవరకూ ఆంగ్లదేశస్థులు మా దేశంవదలి వెళ్ళరు.’