పుట:Narayana Rao Novel.djvu/259

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
258
నా రా య ణ రా వు

‘అవును, నువ్వు చెప్పింది నిజమే అన్నా! చూశావూ! అమెరికా మొదట చిన్నచిన్న రాజ్యాలుగా ఉంది; ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు వారిలో వారు యుద్ధం చేసుకున్నారు చాలాకాలం. అలాంటిది అమెరికా ఇంగ్లండుతో విరోధించి తిరగబడినప్పుడు అందరూ ఏకమయ్యారు. కెనడా ఇంగ్లీషువారి కింద ఏకమయింది. ఫ్రెంచివారూ ఇంగ్లీషువారూ ఏకమయ్యారు. అల్లాగే దక్షిణఆఫ్రికాలో ఆంగ్లేయులకూ డచ్చివారికీ సంయోగం కలిగింది.’

లియోనారా రామచంద్రరావుల స్నేహము నానాట గాఢమాయెను. లియొనారాబాల వచ్చి సోదరప్రేమ వెల్లిగొన రామచంద్రుని యొడిలో గూర్చుండి యాతనికి ముద్దులిచ్చును. మొదట నామె యట్లుచేయుట రామచంద్రునికి చాల సిగ్గజనింపజేసెడిది. కాని యందు కలవాటుబడినాడు. రానురాను రామచంద్రునకు లియొనారా తనచెంత నున్నంతసేపును పరమ హర్షముగ నుండెను. ఆమె సంభాషణ యాతని మనఃపథము వికసింపజేసెను. నానాదేశముల వార్తలు వారు చర్చించుకొనువారు. ఒక్కొక్కప్ప డామె తండ్రియు వారితో జేరువాడు.

రామచంద్ర రా వమెరికా వచ్చిన కొన్ని నెలలవరకు లియొనారాకుగాని, యామె తలిదండ్రులకుగాని, తనకు వివాహమైనదని చెప్పుటకు సందేహించుచుండెను. తర్వాత నొకనాడు తన కంతకుముందే మూడేళ్ల క్రింద వివాహమైన దనియు, తన భార్య ఛాయాచిత్రము తన బావమరది యగు నారాయణరావు పంపినాడనియు దెల్పెను. వారంద రాశ్చర్యపూరితులైరి.

అప్పడు వారందరు సూర్యకాంతము చిత్రము చూచినారు. నారాయణరావు మంచి ఛాయాచిత్రకారునిచే దీయించి పంపిన ఆ చిత్రఫలకములో సూర్యకాంతము చక్కని భంగిమములో ప్రత్యక్షమైయున్నది. రౌనాల్డుసన్ రామచంద్రుని చూచి ‘రామచంద్ర! మిస్ మేయో చెప్పినట్లు అతిబాల్య వివాహములు మీలో నున్నవన్నమాట!’ అని యనెను.

రామ: ఆ! ఉన్నవి. మేయో చెప్పినవి ఇంకా చాలా నిజమైనవి ఉన్నవి.

రామచంద్రునికి తన దేశము నెవరైన కొంచెము నిరసించినట్టు తోచినచో జివ్వున కోపము, విషాదము సంభవించును. పరదేశమున నుండుటచే వానిని జంపుకొని మాట్లాడును. అప్పు డాత డెంతయు విచారమునబడితప్తుడైపోవును.

రౌనాల్డుసన్: మూడునెలల బాలలకు, మూడు నెలల బాలురక వివాహములు జరుగుచున్నమాట నిజమేనా?

రామ: అవును. అక్కడక్కడ కొన్ని అలాంటివి జరుగుచుండును, కాని చాల సకృతు.

రౌనా: అది చాలా విచారకరమైనది కాదూ?