శా ర ద
19
జమీం: వీరు లక్ష్మీపతిగారు. వారు ఈయన బావమరది నారాయణ రావుగారు.
లక్ష్మీ: (జమీందారు గారు పేర్లకై తడుముకొనుట చూచి) ఆతడు రాజేశ్వరరావు నాయుడు.
శ్రీని: చాలా సంతోషంగా ఉందండి. ఈరోజున మీరంతా మా యింటికి అతిథులుగా దయచేయాలి. తప్పదు లక్ష్మీపతి గారూ! మీరు మాట తీసేశారంటే నాకు మనస్సు నొప్పికలిగించారని నష్టానికి దావా తెస్తాను.
లక్ష్మీ: (నిముషములో గ్రహించి) రాజేశ్వరుడిమాట నేను చెప్పలేను గానీ, మేమిద్దరం వస్తాము.
రాజే: నేను ఇంటికి వెళ్ళి తర్వాత వస్తాను.
శ్రీని: ఇంటికి వెళ్ళి భోజనానికి రావాలి. లేకపోతే దావా తప్పదు.
రాజే: మీకు మూడు పైసలు డిక్రీ యిస్తాను. ఇప్పుడే చెల్లించమంటే చెల్లిస్తాను.
శ్రీని: రాజేశ్వరరావు గారూ! మీ నాన్న గారు నాకు పూర్వం నుంచి పరిచితులు. నా సరదా తీర్చండి.
రాజే: పదిగంటలకు కలుసుకుంటాను. సెలవు.
అందరును స్టేషనుబయటకు వెళ్ళినారు. సామానులు జమీందారుగారీ గుర్రపు బగ్గీలలో సర్దించి, శ్రీనివాసరావు గారు తన మోటారులో అతిథు లిరువురిని తన ఇంటికి గొనిపోయిరి.
జమీందారుగారు సొంతమోటారు మీద తమ భవనమునకు వేంచేసినారు.
౫ ( 5 )
శారద
గౌతమీజల చుంబిత ప్రత్యూష వాయు బాలకులు ఒయారముగా దేలి యాడుచువచ్చి, ఆ వన పుష్ప చేలాంచలములలో దోబూచులాడుచుండిరి. వసంత గాఢ సౌరభములు పొగవోలె సుడులుకట్టి యెల్లెడల వ్యాపించుచున్నవి. బోగైన్ విల్లాలయు, గులాబులయు, వివిధ కుంకుమవర్ణములు, మల్లీమాలతుల స్వచ్ఛ హృదయార్ద్ర శ్వేతవర్ణములు, చంపక కనకాంబరముల సువర్ణరాగములు, నీలాంబర నిర్మలనీలములు కలసి మెలసి చిత్రరూపమై సొబగుమించిన జమీందారుగారి యుపవనములో, శారద ముగ్ధవనలక్ష్మివలె పూలు కోయుచున్నది. శారదకు పూలన్న ప్రాణము (ఏ బాలకు గాదు?). పూల చరిత్రలన్నియు నామె వల్లించినది. పూల మనసులు, పూల బాసలు నామె యెరుగును.