పుట:Narasabhupaleeyamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసభూపాలీయము. ఆ. 4

73


క్షీరాంబురాశి ద్రచ్చినవెన్న నీడేరి, నైలింపగనిచన్నుఁబాలఁ బెరిఁగి
కల్పపాదపఫలోత్కరములఁ జని గాంచి, వనజారి నెమ్మేన ననఁగి పెనఁగి


తే.

ధరణిఁ బ్రోది వహించినదానకన్య, సకలయాచకబాంధవు ల్సంతసిల్ల
నీకరగ్రహణావాప్తి నెరసె నౌర, వైరిగజసింహ యోబయనారసింహ.

71

శబ్దాలంకారములు —

తే.

ఇఁక నలంకారనికరంబు లేర్పరింతు, నవియుఁ గవితాలతాంగికి హారకటక
కంకణాదులక్రియ య నలంకరణకరణ, పరిణతులచే నలంకారభావ మొందు.

72


క.

ఇవియును శబ్దార్థంబుల, ద్వివిధములై క్రమముతోడ వెలయు ననుప్రా
సవిశేషంబుల నుపమా, దివిశేషములను గావ్యదీపితసరణిన్.

73


తే.

అం దను ప్రాసభేదంబు లైన శబ్ద, భవదలంకారమును మున్ను ప్రస్తుతింతు
నడర నెడ లేక రెండు రెం డక్షరంబు, లెనయు నియమంబు ఛేకమౌ నెట్ల టన్న.

75


పంచచామరము.

స్ఫురత్కృపాబలప్రతాపభూతిధైర్యభూభరా
ర్చిరంగదానబుద్ధివైఖరి న్హరి న్హరి న్సుధా
హరు న్హరు న్గిరి న్గిరి న్మహానలు న్నలు న్రమా
గురు న్గురు న్జయింతు వౌఁ దగు న్నృసింహభూవరా.

75


తే.

ఒక్కవర్ణంబు కడదాక నుద్ధరింపఁ, బరఁగు జృంభణవృత్త్యనుప్రాస మయ్యె
దలఁపఁ బునరుక్తి యయ్యుఁ దాత్పర్యభేద, మొనయు నియమంబు లాట మౌ నె ట్లఁటన్న.

76

వృత్త్యనుప్రాసము—

చ.

సమదవిపక్షశిక్షణవిచక్షణదక్షిణదోరనుక్షణ
భ్రమదసిదుర్ణిరీక్షసమరక్షపితక్షితిపక్షతక్షర
త్సమధికశోణితక్షరకృతక్షణరక్షితపక్షిలోక నిన్
గమలదళాక్షుఁ డేలు బలగౌరవసింహ నృసింహభూవరా.

77

లాటానుప్రాసము—

చ.

ఘనత నృసింహుఁ జూడఁ గలకన్నులు కన్నులు వానికౌఁగిటం
జనువున నేపు చూపఁ గలచన్నులు చన్నులు వాని మోవికిం
జొనిపిన పాటలాధరము జూన్నులు జున్నులు వాని మేనఁ జే
ర్చినసరసాంగవల్లికల చెన్నులు చెన్నులు వో తలోదరీ.

78


క.

సమపర్ణయుగాధిక మై, యమరిననియమంబు యమక మగుఁ గృతులం దా
యమకం బనేకవిధ మగుఁ, గ్రమమున నొక రెండుమూడుగతు లెఱిఁగింతున్.

79