పుట:Narasabhupaleeyamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కావ్యాలంకారసంగ్రహము


క.

మేలిమి రెండవపాదము, నాలవపాదంబు నొక్కయనువునఁ దనరం
జాలినయమకము కృతులం, దాలింపఁగఁ బాదయమక మగు నె ట్లన్నన్.

80

పాదయమకము —

క.

ఔరా యోబనృపాలకు, మారా మనుమదనసమరమాధుర్యుఁడ వై
ధీరానృసింహ కూడితి, మారా మనుమదనసమరమాధుర్యుఁడ వై.

81


క.

ప్రస్తుత మగుముక్తపద, గ్రస్తం బన నదియుఁ గృతులఁ బరఁగు బదాంతో
దస్తము పాదాద్యంతను, విస్తృతము పదాంతసింహవీక్షణ మనఁగన్.

82

పాదాంతపాదాదిముక్తపదగ్రస్తము —

క.

సుదతీనూతనమదనా, మదనాగతురంగపూర్ణమణిమయసదనా
సదనామయగజరదనా, రదనాగేంద్రనిభకీర్తిరసనరసింహా.

83

సింహావలోకనముక్తపదగ్రస్తము —

క.

మన వేటికి నూతనమా, తన మాయెడఁ బ్రేమ దనకుఁ దక్కితి ననుమా
ననుమానక దయ దనరం, దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

84

పద్మబంధము —

చ.

కనుఁగొన రేకు లెన్మిదియుఁ గర్ణిక చుట్టిడి స్రగ్ధరాంఘ్రుల
న్మునుపటియేడువర్ణములునుం గడయేడుఁ బ్రవేశనిర్గతు
ల్పనుపడ నాల్గుదిగ్దళముల న్లిఖియించి విదిగ్దళంబులం
దెనయఁగఁ బాదమధ్యగము లేడును వ్రాయఁగఁ బద్మబంధ మౌ.

85


స్రగ్ధర.

రామాకశ్రీసమగ్రరణకృతభయముద్రాససక్తారమారా
రామారక్తాససద్రాష్ట్రభరణపటిమాత్రాసకుస్తికుమారా
రామాకున్తీకుసత్రాప్రకటతరవిచిత్రాపవిత్రాసమారా
రామాసత్రావిపత్రాశ్రయనరసరుచిగ్రామసశ్రీకమారా.

86

చక్రబంధము —

క.

పదిచుట్లు నాఱురేకులు, పదిలపఱిచి సుకవిపేరు పతిపేరును లోఁ
బొదలఁగ నేవంవిధగుణ, విదితం బగుచక్రబంధవిధ మౌ నె ట్లనన్.

87


శా.

రక్షానాకపమూర్తిభాసురగభీరావిక్రమోహాస్పదా
దక్షారమ్యమతిస్థిరాభరణవిద్యాకృత్యశఙ్కిస్వనా
వక్షస్సింధుపకన్యకానరసభవ్యాతిగ్మధీతంత్రదా
దాక్షిణ్యారతనాదవైభవవినోదాహేమనాగాశ్వదా.

88