పుట:Narasabhupaleeyamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసభూపాలీయము

41


తే.

హరికి వర్షాశరద్భ్రాంతి యడరుననెడి, భ్రాంతి మదలంక్రియారూఢిఁ బ్రబలునిద్ర
దెలివినున్నట్లు యోగనిద్రలు వసహించు, ననెడియుద్ప్రేక్ష వ్యంగ్య మై యతిశయిల్లు.

136

కవినిబద్ధవక్తృప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని —

మ.

అనురాగాంబుధి యుబ్బి వెల్వడినయ ట్టాపూర్ణఘర్మాం బువుల్
దనువల్లిం దిగజాఱఁ గన్నుఁగవ లేదళ్కు ల్పిసాళించుచున్
ననవిల్కానిపురప్రవేశకలనానాళీకదామంబు లై
తనరం గోమలి నిన్నుఁ జూచె నరసేంద్రా సాంద్రతేజోనిధీ.

137


క.

ఈవాక్యార్థముచేతను, భూవల్లభ నిన్నుఁ గోరి పొలఁతి విరహతా
పావృత్తి నున్న దిపు డను, నావస్తువు వ్యంగ్య మగుచు నతిశయ మొందున్.

138

కవినిబద్ధవక్తృప్ఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతాలంకారధ్వని —

చ.

సురగిరిచుట్టునుం బవరిచుట్టెద వేల దినేరరత్న సం
భరితము దేవతాధనముఁ బాయక కాచెద నంచు నేఁటికిన్
సురతరులం గరాంగుళులఁ జొప్పడఁ దాల్చి యశోభ్రగంగచేఁ
బరఁగి నృసింహుఁ డే సుకవిపంక్తులఁ బోవ నిదేల యేరికిన్.

139


క.

తనరెడు నీవాక్యార్థం, బున శ్రీనరసింహుఁ డఖిలమును బ్రోవఁగ నా
యనిమిషగిరివలెఁ దగు నను , ననుపమ మగునుపమ వ్యంగ్యమై పొగ డొందున్.

140

కవినిబధ్ధవక్తృప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలాలంకారకృతవస్తుధ్వని —

చ.

ధరణి ననంతకీర్తియుఁ బ్రతాపముఁ గల్గినరాజ వౌట నిన్
దరణి మనోరవిందమునఁ దాల్చినచుట్టఱికంబుపేర్మినో
కరివరయానకు న్విశదకాంతియుఁ గాకయు నై కడంగి బి
త్తర మగుమేనఁ గీర్తియుఁ బ్రతాపము నిల్చె నృసింహభూవరా.

141


తే.

నెఱయు కీర్తిప్రతాపాఢ్యు నిన్నుఁ దలఁప, యశము శౌర్యంబు గలిగిన ట్లలరు వెలరు
గాకయును ననునుత్ప్రేక్షఁ గాంత నేలు , విరహమున కోర్వ దను వ్యంగ్యవిభవ మలరు.

142

కవినిబద్ధవక్తృప్రొఢోక్తిసిద్ధార్థశక్తిమూలాలంకారకృతాలంకారధ్వని —

చ.

చెలువ యదేమి యామగువ చిత్రమునందు నృసింహభూవరుం
గలయ లిఖించువేళఁ బులకంబులు గ్రొంజెమరుం దలిర్పఁగా
నొలవు వడంకుచున్నది సముజ్జ్వల మైననృపాలరూపమున్
వలపులు రేఁచు చున్నరతివల్లభురూపనిభీతిఁ జెందెనో.

143


క.

వరుని లిఖంచుచు వడఁకెడి, సరోజశరుఁ డనియె యనెడి సందేహమున
న్నరసింహుఁడు మరుకైవడిఁ, బరఁగు ననెడియుపమ వ్యంగ్యభాసము నొందున్.

144