పుట:Nanakucharitra021651mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనమున నియోగించెను. నియోగించుటయు నానకు వల్లెయని యాపని జేయ సమ్మతించెను. కాని యల్పకాలములోనే తన కుమారుడు పసుల కాచుటకు బనికిరాడని కాళుడు గ్రహించెను. ఏలయన నానకు పరమదయాళువగుటచే నోరులేని జంతువులను బలవంతముగ నిర్బంధించి యొక్కచో నిల్పుట కూడదని తలంచి పసుల నదలింపక యవియిచ్చవచ్చిన తెఱంగున విహరించుచుండ జూచుచు నూరకుండును. లేగ దూడ తల్లిపాలు కుడుపదలచెనా దాని తల్లిపాలది ఏల కుడువగూడదని తక్షణమె యాదూడను పాలు గుడుపనిచ్చును. ఆకుమడియైనను సరియే పండిన చేనైనను సరియే యావు మేయదలచెనా, పాప మది యిచ్చవచ్చినట్లేల కసవు తినగూడదని తక్షణమే దానిని మేయ విడుచును.

పరమేశ్వరుడు మనుష్యులను దదితర జంతువులను సమానముగ సృష్టించినను మనుష్యుడు లేనిపోని యధికారములబూని యతిక్రూరుడై నోరులేని యాజంతువులను దన యిచ్చవచ్చిన తెఱంగున బాధలుపెట్టి మంచిపదార్థములెల్ల దానే యనుభవించుచు నెల్ల సౌఖ్యముల దానే పొందుచు నుండుట యేటిన్యాయమనియు మనుష్యులలో తల్లులు పాలిచ్చి తమ బిడ్డల బోషించి యెంతో గారామునం బెంచుకొనుచుండ పసువు తమ యిచ్చవచ్చినప్పుడు తమ పొదుగుపాలను తమ దూడల కిచ్చుకొనుట కేల స్వాతంత్ర్యముండగూడదనియు