పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనులు చేయడం మొదలైనవి వీరిలో సాధారణ విషయాలుగా ఉంటాయి.

లైంగిక సమస్యలు

యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో శరీరంలో వచ్చే మార్పుల గురించి, లైంగికావయవాల గురించి వారికి సమగ్రమైన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో అత్యధిక శాతం టీనేజర్లకు ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడమో, లేదా భ్రమలలో జీవించే పరిస్థితితో ఎదురవుతున్నది. ఫలితంగా వయస్సు పెరిగిన తరువాత లైంగిక విషయాలలో పలు సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది.

భావోద్రేకాల లోపాలు

యావనారంభ దశలో మానసిక రుగ్మతలు ఎక్కువగా కనిపించవుకాని, మానసికపరమైన అలజడులు అత్యధికంగా ఉంటాయి. వారి భావోద్రేకాలు తరచుగా మారిపోతుండటం, తీవ్రమైన కోపానికి గురికావడం, ఎంతో ఉద్వేగానికి, ఉద్రేకానికి గురికావడం జరుగుతుంటుంది.

యుక్తవయస్సులోకి అడుగుపెడుతున్న వారితో వ్యవహరించే సమయంలో ఖచ్చితమైన, నిర్దిష్టమైన ధోరణి అవసరం. వారు అల్లరి చేస్తారనో, ఇంట్లో శాంతి లేకుండా చేస్తారనో భయపడి వారడిగిన ప్రతి విషయానికీ తలొగ్గాల్సిన పనిలేదు. వారు తప్ప చేస్తున్నారని అనిపిస్తే ఆ విషయాన్ని ఖండితంగా చెప్పి సరిదిద్దాల్సిందే. అయితే వారి అభిప్రాయాలకు తప్పకుండా విలువ ఇవ్వాలి. నెమ్మది నెమ్మదిగా కుటుంబపరమైన వ్యవహారాలలో వారిని కూడా భాగస్తులను చేయాలి. దీనివలన తల్లిదండ్రులు తమను వేరుగా చూస్తున్నారనే అభిప్రాయం వారికి కలుగదు.

అయితే వారి ప్రవర్తన సాధారణ స్థాయిని మించి తీవ్రమైతే మాత్రం నిపుణులైన కౌన్సిలర్ల వద్దకు తీసుకునివెళ్లి కౌన్సిలింగ్ చేయించడం తప్పనిసరి.