పుట:NagaraSarwaswam.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70


ఒకచేతితో ఆమెజడనుపట్టుకొని వేరొకచేతితో ఆమెముఖమును తన వంకకు త్రిప్పుకొని ముద్దుపెట్టుకొన్నాడు. అప్పుడామె కనుబొమలను పై కెత్తి విస్ఫారితములు, చంచలములుఅయిన నేత్రాలతో కోపముకాని కోపమును వ్యతిరేకతకాని వ్యతిరేకతను ప్రదర్శిస్తూ చూచింది. ప్రియునకాచూపు మదనుని తూపు (బాణం) అయింది. అతడు ఆదేశముతో విహ్వలుడై ఆమెను గాఢంగా కౌగలించుకొన్నాడు.

ఇదుగో! ఇట్టి చేష్ట 'లలితము' అనబడుతుంది.

16. బిబ్బోకము :- భర్త అధికంగా తన్ను ప్రేమిస్తున్న కారణంగా మిక్కిలి గర్వముకలదై వనిత తనకిష్టమైన వస్తువునందు అప్పుడప్పుడు భర్తయందు ఆనందం చూపడం లేదా అతనియొక్క ప్రణయకోపాన్ని లక్ష్యంచేయకపోవడం 'బిబ్బోకము' అనబడుతుంది.

సాధారణంగా భర్త ఎవరి వశమందుంటాడో అట్టి స్త్రీలయందు మాత్రమే ఈ విబ్బోకం అనే శృంగార చేష్ట వ్యక్తం అవుతుంది.

"ఇదిగో! యీ సన్నగడి చీర నీకై తెచ్చాను. అబ్బ! ఎన్నికొట్లు తిరిగేనని; రంగుబాగున్నచోట నేత బాగులేదు. నేతబాగున్నచోట రంగుబాగులేదు. రెండూ బాగున్నచోట అంచు నచ్చలేదు. దాదాపు రెండుగంటలు వెదుకగా వెదుకగా యీచీర ఒకదుకాణంలో కనబడ్డది. ఆమధ్య నీవిట్టిచీర కావాలి అన్నావుకదా? అని అచ్చం నీవు కోరినరకం చీరకై శ్రమించి తెచ్చాను'-అన్నాడు భర్త భార్యతో.

భర్తకుతనమీదగల ప్రేమాధిక్యానికి గర్విస్తూవున్న ఆ భార్య ఆఁ! చాల శ్రమపడ్డారు! ఎలాగైతేనేం తెచ్చేరు ఇన్నాళ్లకి ఒకనూలుచీర-అన్నది.

ఈమాటతో అతడు నీరసపడిపోయాడు. తానింత శ్రమపడి తెచ్చిన వస్తువుమీద, తనమీద ఇంత అనాదరం చూపినందులకు భార్యమీద కొంత అలుకకూడ వచ్చింది. కాని అలుకను ప్రదర్శించడానికి సమయం కాదనుకొన్నాడతడు.