పుట:Naajeevitayatrat021599mbp.pdf/903

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా కొన్ని వాక్యాలు మాట్లాడిన తర్వాత, మధ్య మధ్య ఆగడం కూడా జరుగుతూండేది. అయినప్పటికీ, ఉపన్యాస వస్తువుకూ, క్రమానికీ ఏమీ భంగం ఉండేది కాదు.

వయసులో ఉన్నప్పటిలాగే ఎండల్లో కారు ప్రయాణాలు చేయడం ఆయన మానలేదు.

ఇంతలో విశాలాంధ్ర ఏర్పడింది. సంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రుల ప్రతిభ ప్రకాశవంతమైనదనే సంతృప్తితో ప్రకాశంగారు దేశం నలుమూలలకూ పర్యటిస్తూండేవారు.

1957 మే లో ఆ విధంగా అతి తీవ్రమైన ఎండలలో ఒంగోలు ప్రాంతంలో పర్యటించి, వడదెబ్బ తిని కారులోనే హైదరాబాదు చేరుకున్నారు. కొందరు మిత్రులు, ఆయన పడుతున్న బాధ చూసి హాస్పిటలులో చేర్చితే మంచిదని తీసుకుపోయి ఉస్మానియా హాస్పిటలులో చేర్చారు.

అంత్య దృశ్యము

ఆ విధంగా, ప్రకాశంగారు 18 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. 19 వ రోజున చికిత్స చేయడానికి, అక్కడున్న వైద్యులు ఆయనకు ప్రాణవాయువు ఇవ్వడానికి, ప్రయత్నించారు. ప్రకాశంగారు లోగడ ప్రకృతి చికిత్సలోను, విద్యుత్ చికిత్సలోను మాత్రం నమ్మకమున్నవారు గనుక, ప్రాణవాయువు తీసుకోడానికి నిరాకరించారు.

కాని, 20 వ తేది ఉదయం ఆయనని చూడడానికి అక్కడికి వచ్చిన మంత్రి వి. బి. రాజు ప్రోద్బలంవల్ల ఆక్సిజన్ ఇవ్వడానికి తిరిగి ప్రయత్నించారు. అప్పటికే ప్రకాశంగారికి ఆ చికిత్సను నిరాకరించే శక్తి తగ్గిపోయింది. ఆ ప్రాణవాయువు ఆ రోజు ప్రకాశంగారికి ప్రయోజనకారి కాలేకపోయింది.

ఆయన నాడి అతి బలహీనమై పోయింది. కఫం కమ్ముకొని రా సాగింది. ఊపిరి తిత్తులు వ్యాధిపూరితము లయ్యాయి.

సాయంకాల మయింది.