పుట:Naajeevitayatrat021599mbp.pdf/904

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడ ప్రక్కన వైద్యనిపుణులయిన కె. ఎస్. రావు, వెంకటస్వామి, దయాళ్‌దాసు, తాహి, చారి, బహదూర్‌ఖాన్, సయ్యద్, శ్రీమతి భారతి, శ్రీమతి లక్ష్మీగారలు మొదలైన ప్రఖ్యాతులంతా చుట్టూ ఉన్నారు.

ప్రకాశంగారి కొడుకు హనుమంతరావు - భార్య, పిల్లలతో మంచం ప్రక్కన నిల్చున్నాడు.

7-35 అయేసరికి - సామూహికంగా, దు:ఖసూచకంగా పెద్ద కేకలు అనుకోకుండా అందరి గొంతుకలలోంచి వినబడ్డవి.

అంతవరకు దేహస్థంగా ఉన్న ప్రకాశంగారి ఆత్మజ్యోతి, ఈశ్వర జ్యోతిలో కలిసిపోయింది.

ప్రక్క గదిలో నున్న అల్లూరి సత్యనారాయణరాజు, తనకున్న జబ్బుతోనే ప్రకాశంగారి మంచం దగ్గరికి ఒక్క గెంతులో వచ్చి, "అమ్మో" అని కేక వేశాడు.

అంతక్రితం, ఒక పది నిమిషాల ముందు వచ్చిన గోపాలరెడ్డిగారు అక్కడే ఉన్నారు. గోపాలరెడ్డిగారు వచ్చారని హనుమంతరావు తండ్రి చెవిలో చెప్పగా, ఆయన కళ్ళు సగం తెరిచి మాట్లాడడానికి యత్నించారు. కాని, యత్నించిన మాట రాకుండానే కన్నులు అలాగుననే మూతపడ్డాయి.

అప్పటికప్పుడే హాస్పిటలు ఆవరణలోకి ఈ మరణ వార్త విని వందలకొద్ది ప్రజలు ప్రవాహంగా వచ్చేస్తున్నారు.

మేడమీదనుంచి, శరీరాన్ని క్రిందికి తెచ్చి, మంచుగడ్డల పేర్పు మధ్య పెట్టారు.

అంతలో, ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎమ్. పి. పాయ్‌గారు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో చిత్తూరులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారు, ఈ వార్త విని - పర్యటన