పుట:Naajeevitayatrat021599mbp.pdf/859

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోకా సుబ్బారావుగారు తమ న్యాయస్థానంలోకి చురుకుగా నడిచి వెళ్ళి పోయారు.

మేము భవనం వదలి తిరిగిపోతూన్న సమయంలో, కారులో, కట్జూగారు నాతో అన్నారు: "ఏమి విశ్వనాథము! మీ ప్రధాన న్యాయమూర్తి మాటవరసకైనా ఓ మారు కోర్టు భవనంలోకి రావలసిందని నన్నుగాని, నిన్నుగానీ, చివరికి మనందరికీ పెద్ద అయిన ప్రకాశంగారినిగాని పిలవలే దేమయ్యా?"

ఆయన అది అడగడానికి ముందు నా మనసులో నేనూ అదే అనుకున్నాను.

'న్యాయమూర్తుల పంథాలు ఇలా ఉంటాయి కాబోలు' అని మాలో మేము అనుకున్నాము. కోర్టు భవనాలలోకి వెళ్ళకుండానే మా బసలకు వెళ్ళిపోయాము. చిరకాల వాంఛితమైన ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రధాన న్యాయస్థానము, ఆ రోజు స్థాపన జరిగిన సంతృప్తిలో మాకు మరేమీ కనిపించలేదు.

21

శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయము

1946 లో, ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తిరుపతి దేవస్థానం సాయంతో తిరుపతిలో విశ్వవిద్యాలయం స్థాపించడానికి ఒక బిల్లు తయారు చేశారు. అప్పట్లో కె. కోటిరెడ్డిగారు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండేవారు. తిరుపతి దేవస్థానం వారు 10 లక్షల మూలధనం ఇవ్వడానికి అంగీకరించారు. కాని, బిల్లు తయారయేసరికి, మంత్రివర్గం పతనమయే స్థితిలో ఉంది. శాసన ముసాయిదా, ప్రకాశంగారి మంత్రివర్గంమీద విశ్వాసరాహిత్య తీర్మానం వచ్చిన తర్వాత అందింది.

1953 లో ముఖ్యమంత్రికాగానే, ప్రకాశంగారే దాన్ని మళ్ళీ