పుట:Naajeevitayatrat021599mbp.pdf/860

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పునరుద్ధరించారు. అప్పటి మంత్రివర్గంలోని ఏడుగురు మంత్రులలోను, నలుగురు రాయలసీమకు చెందినవారే. అందుచేత, వారు దీన్ని సంతోషంగా అంగీకరించారు. ఇక మిగిలినవారిలో విద్యాశాఖ మంత్రి పట్టాభిరామారావుగారు ఒకరు. ఆయన రాజాజీ మంత్రివర్గంలో కూడా మంత్రిగా ఉండేవారు. అందుచేత, కొంత నిదానం అలవాటు చేసుకొన్నవారు.

ఆయన - అప్పటి కప్పుడే - రాధాకృష్ణన్ కమిటీ, క్రొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించడానికి తొందరపడగూడదని చేసిన సిఫారసును, ఒక అభ్యంతరంగా చూపూరు.

నా వాదం ఇది: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆనర్సు తరగతులలో, విజ్ఞాన శాఖలలో 11, 12 స్థలాలు (సీట్లు) తప్ప హెచ్చుగా లేవు. హెచ్చు చేయమంటే, యూనివర్శిటీ అధికారులు ఒప్పుకోరు. పోనీ, రాయలసీమ ప్రాంతంలో ఒక కాలేజీలో ఆనర్సు తరగతులు ప్రారంభించమంటే, విశ్వ విద్యాలయకేంద్రంలో తప్ప, ఆనర్సు తరగతులు పెట్టడానికి వీలులేదన్నారు. అందుచేత - దక్షిణ, పశ్చిమ జిల్లాలలోనుంచి వచ్చే విద్యార్థులకు, అందులో ధనాభావంగల విద్యార్థులకు - అవకాశాలు తక్కువ అనే విషయం గుర్తించి తిరుపతిలో విశ్వవిద్యాలయం స్థాపించడమే మార్గ మనుకున్నాము.

అయితే, లోగడ 10 లక్ష లిస్తామన్న తిరుపతి దేవస్థానం వారు, అప్పట్లో ఆరు లక్షలు మాత్రమే ఇవ్వగల మన్నారు. ఏమయినా, విశ్వవిద్యాలయం స్థాపించక తీరదనుకున్నాము. ఇందుకొక నివేదిక తయారుచేయడానికి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కళాశాల ప్రిన్సిపాలు అయిన కె. రంగధామరావుగారిని నియమించడం జరిగింది. విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వి. ఎస్. కృష్ణగారి సలహా సంపత్తితో, వారొక నివేదిక సమర్పించారు. దానికి రెండుకోట్లు ఖర్చు చూపించారు.

చెప్పకేమి! ఈ ఖర్చుకు భయపడి అయినా, ఈ క్తొత్త విశ్వ