పుట:Naajeevitayatrat021599mbp.pdf/834

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19

ప్రథమ ఆంధ్ర శాసన సభ -

ప్రకాశంగారి నాయకత్వము

కర్నూలులో ఉన్న కోర్టు భవనాన్ని శాసన సభా మందిరంక్రింద మార్చడం జరిగింది. ప్రభుత్వ మేర్పాటయిన ఒక నెల తర్వాత ప్రథమ శాసన సభాసమావేశము జరిగింది.

అంతకు ముందు, నా పార్టీకి చెందిన - నల్లపాటి వెంకట్రామయ్యగారినీ, పసల సూర్యచంద్రరావుగారినీ క్రమంగా స్పీకరు, డిప్యూటి స్పీకరుగా ఎన్నుకోడానికి ప్రభుత్వ పక్షాన ఉండే శాసన సభ్యుల సమావేశంలో నిర్ణయింపబడింది.

శాసన సభ స్పీకరు ఎన్నిక కాకపూర్వము, సభ్యులు యావన్మందీ భారత సంవిధానము ఎడల శ్రద్దానిష్ఠలు కలిగి ప్రవర్తిస్తామని ప్రమాణ స్వీకరణ చేయవలెను. సభ్యులలో అందరికన్నా వృద్ధుడైన సభ్యుని తాత్కాలిక అధ్యక్షునిగా గవర్నరు నియమిస్తారు.

ఈ సందర్భంలో, గుంటూరునుంచి ఎన్నికైన నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావుగారిని గవర్నరు తాత్కాలిక అధ్యక్షునిగా నియమించారు. ఆయన బారిష్టరు. ప్రకాశంగారే ఆయన హైకోర్టులో న్యాయవాద వృత్తి ఆరంభించడానికి, బారిస్టరు పట్టీలో ఆయన పేరు చేర్చడానికి హైకోర్టులో ప్రతిపాదించారు. తరువాత, గాంధీగారి ఉద్యమం ప్రారంభమైన సందర్భంలో తాను సంపన్న గృహస్థుడైనా ఆస్తిపాస్తులు పోతాయన్న జంకులేకుండా దేశస్వాతంత్ర్యసమరంలో ధైర్యంగా దుమికిన స్వాతంత్ర్య యోధుడాయన. కొంతకాలం గుంటూరు మునిసిపల్ ఛైర్మన్‌గా ఉండేవారాయన.

ఆయన - చిన్నది, చక్కనిది అయిన శాసన సభ ప్రారంభోపన్యాసంచేసి, సభ్యులందరినీ ఒకరి తరువాత ఒకరికి సభ్యత్వ ప్రమాణ స్వీకారం (ఓట్ ఆఫ్ ఆఫీస్) తీసుకోమన్నారు.