పుట:Naajeevitayatrat021599mbp.pdf/805

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పార్టీ కార్యనిర్వాహకవర్గం ఏర్పాటు చేస్తున్నపుడు వేసుకొంటా"మని కృపలానీగారు చెప్పారు.

కార్యదర్శిగా సాదిక్ అలీ పేరు చెప్పినప్పుడు, తిరిగీ అదేమిత్రుడు, 'రంగాగారిని కార్యదర్శిగా అయినా వేయండి' అని కేకలు వేశాడు.

అందుకు కృపలానీగారు, "నేను చేస్తున్న పని నాకు తెలుసు. నాకు కార్యదర్శి అంటే నేను చెప్పేమాటలు, ఉత్తరాలు వ్రాసుకొంటూ నావెంట తిరిగే మనిషి. రంగా పెద్దవారు. ఆయనకు ఇవ్వవలసిన స్థానము ఎలాగూ ఇస్తాము. మీరు అనవసరంగా ఇక్కడ గలభా చేయకండి," అన్నారు.

ఆ విషయం అంతటితో ఆగిపోయింది.

మిగిలిన కార్యక్రమం సాఫీగా జరుగుతున్నది. కాని, రంగాగారు చడీచప్పుడు లేకుండా ఆ హాలులోంచి ఏదో పనిమీద అవతలకు వెళుతున్నట్టుగా వెళ్ళారు. అక్కడ ఒక పత్రికా విలేఖరిని ఆవరణలోకి పిలిచి, అక్కడ ఏర్పాటయే పార్టీ ఏమీ పనిచేసే పార్టీ కాదన్న భావం వెలిబుచ్చి, దాంతో తన సంబంధాన్ని అప్పుడే వదలుకొంటున్నట్టు చెప్పి, కలకత్తా వెళ్ళిపోయారు.

అక్కడ - క్రొత్తపార్టీతో సంబంధం వదులుకోవడమే గాక, ఆంధ్రజిల్లాలలో ప్రకాశంగారితో కలిసి తాను ఏర్పరచిన 'ఆంధ్ర ప్రజాపార్టీ' నుంచి గూడా విడిపోతున్నట్టు పేర్కొని, "కృషికార్ లోక్‌పార్టీ" అనే క్రొత్త పార్టీని తాను స్థాపిస్తున్నట్టు ప్రకటించారు.

ఎన్నికలలో అద్భుత విజయము

ప్రకాశంగారు తిరిగివచ్చి చెన్నరాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగారు. 1952 ఎన్నికలకు అభ్యర్థులుగా తెలుగు జిల్లాల్లోను, చెన్నపట్నంలోను మాత్రం లోక్‌సభకు, రాష్ట్ర శాసన సభకు 117 గురు అభ్యర్థులను నిలబెట్టారు. ఇదిగాక, దక్షిణ జిల్లాలనుంచిగూడా అనేకులను నిలబెట్టారు. ఇందులో సర్కారు జిల్లాలనుంచి అనేకులు గెలిచారు. ప్రకాశంగారు