పుట:Naajeevitayatrat021599mbp.pdf/806

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసిన ప్రచారంవల్ల లాభం పొంది, 'కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ' గెలవని చోట్ల కమ్యూనిస్టులుగానీ, స్వతంత్ర సభ్యులుగానీ గెలిచారు. కాంగ్రెసు పేరున గెలిచినవారు ఏమాత్రమైనా ఒక్క రాయలసీమలోనే గెలిచారు.

అప్పటివరకు, ఆంధ్రులు ఏకచ్చత్రాదిపత్యం వహిస్తున్న కాంగ్రెసు పార్టీకి చెన్నరాష్ట్ర శాసన సభలో మెజారిటీ పూర్తిగా పోయింది. కాని వారికి కృషికార్ లోక్ పార్టీ, ముస్లిమ్‌లీగు సహాయంగా ఉండేవి. మూడు పార్టీలు కలిసినా వారి బలం 150 దాటక పోయింది. ప్రతిపక్షంలో 164 సభ్యులు ఉండేవారు. ప్రకాశంగారు ఆ ఎన్నికలల్లో మద్రాసునుండి పోటీచేసి ఓడిపోయారని ఇదివరకే వ్రాశాను. కాని, తమ వ్యక్తిత్వాన్నిబట్టి ఆయన ఆ 164 సభ్యులను ఏకంవేసి యునైటెడ్ ఫ్రంటు అనే సమాఖ్య క్రింద శాసన సభా కార్యక్రమంకోసం ఏర్పాటు చేయగలిగారు. ఆ సమాఖ్య కార్యక్రమం ప్రారంభించినపుడు నేను ప్రతిపక్ష నాయకుడుగా ఉండడానికి అందరూ అంగీకరించారు. ఆ సమాఖ్యలో కమ్యూనిస్టులు, కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ, మద్రాస్ టాయిలర్స్ పార్టీ, ఇంకా ఏవో వేరే పార్టీలు, స్వతంత్రులు ఏకమయ్యారు.

చెన్నరాష్ట్రానికి అంతవరకు గవర్నరుగా ఉన్న భావనగర్ రాజా గారి కాలపరిమితి ముగియగా, కేంద్ర ప్రభుత్వంవారు 'శ్రీప్రకాశ' అనే ఆయనను నియమించారు. ఈ శ్రీప్రకాశగారు చాలా మేధావి. నెహ్రూగారికి ఆప్తులు. పెద్ద పెద్ద యూనివర్శిటీ డిగ్రీలు పొందినవారు. 1946 లో నెహ్రూగారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఆయన మంత్రిగా ఉండేవారు. అయితే, ఆయన కొంత స్వతంత్రంగా ఆలోచించుకొనే లక్షణం గలవారు గనుక, నెహ్రూగారు ఆయనను గవర్నరుగా పంపివేశారు. అంతకు ముందు కరాచీలో హైకమిషనర్‌గా ఉండి, ఆయన చెన్నరాష్ట్రానికి గవర్నరుగా వచ్చారు. ప్రకాశంగారంటే గురుభావం కలవా రాయన.

కాంగ్రెసువారికి మెజారిటీ లేదని ఇదివరలోనే వ్రాశాను. పైగా