పుట:Naajeevitayatrat021599mbp.pdf/801

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్గం వారిలోకి మలినప్రవేశం చేయడంవల్ల కలిగిన ఓటమికి ఎవరూ నిరుత్సాహ పడకూడదనీ, మంత్రులుచేసే అధికార దుర్వినియోగం, దొంగ కాంగ్రెస్ మెంబరుల జాబితా నిర్మాణం ప్రజలకు బోధపరిచినట్లయితే వారందరూ ఎన్నికలలో తిరిగి ఓడిపోగలరనీ అందరికీ దృడవిశ్వాసం కలిగింది.

ప్రతి జిల్లాలోనూ ప్రకాశం, రంగా వర్గాల అనుయాయులు చేయవలసిన కార్యక్రమంకూడా కొంతవరకు వ్రాయడం జరిగింది. నేను విశాఖపట్నం వెళ్ళిపోయాను.

ఆ రాత్రి - బాగా రాత్రివేళ - మా వర్గాలకు చెందినవారు కార్యక్రమం వివరాలు ఆలోచించుకోడానికి కూర్చుంటూండగా, ఒక క్రొత్త సమస్య బయలుదేరిందట.

" 'కాంగ్రెసు మంత్రులు ఓడిపోతారు,' అని మన మంటున్నాము. వా రిప్పుడేమో అధికారంలో ఉన్నా, ఎన్నికలలో నిలబడతారు కదా! ఎవరిమీద మనం దోషారోపణ చేస్తున్నామో వారు ఎన్నికలలో నిలబడినప్పుడు, కాంగ్రెసు సభ్యులుగా ఉంటూ, వారిని ఓడించవలసిందని ప్రజలకు ఏ విధంగా చెప్పగల" మన్న ప్రశ్న ప్రకాశంగారినీ, రంగాగారినీ, కాళేశ్వరరావుగారినీ వేధించింది.

"మంత్రివర్గానికి వ్యతిరేకంగా దొంగతనంగా ప్రచారం చేయడం కాంగ్రెసు తత్వానికి వ్యతిరేకం ..... పెద్దమనిషి తరహాకు ప్రతి కూలం...."

"అయితే, మనం మౌనంగా ఉండవలసిందేనా?"