Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావన

రాష్ట్రపతి డాక్టర్ వరాహగిరి వెంకటగిరి

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు ఒక్క వ్యక్తి కాదు; అర్ధ శతాభ్దికి పైగా ఆంధ్ర రాజకీయ ప్రజాహిత జీవన రంగంలో ఆయన ఒక మహా సంస్థ. ఆయన వ్యక్తిత్వం మహా గోపుర శిఖరోన్నతం. ఆయన జీవిత గాథ బహుముఖ ప్రకాశం గలది; బహురస సంపన్నమైనది. బొడ్డున మాణిక్యం పెట్టుకొని పుట్టిన భాగ్యశాలి కారు ఆయన. అతి సామాన్య స్థితి - కాదు, నిరుపేద దశ -లో నుండి ఎదిగి ఎదిగి మహద్వైభవ శృంగాన్ని అందుకొన్న అతిసత్త్వుడాయన. ఉజ్జ్వల దేశ భక్తి, నిరుపమ త్యాగశీలం, అన్నింటికన్న ముఖ్యంగా ఆయన అక్షయ శక్తి, స్వభావ సౌష్టవం....ఆయన విజయ హేతువులు. ప్రకాశం గారు నాకు మరీ సన్నిహితులు; మన స్వాతంత్ర్య సమర చరిత్రలో అతిక్లిష్ట దశలో అయన నాయకత్వాన ఆయనకు అత్యంత సన్నిహితుడనై పనిచేసే భాగ్యం నాకు కలిగింది. అటువంటి ఆప్తుని గురించి వ్రాయటం కష్టం. ఆ రోజులు తలుచుకుంటే, వాస్తవంగా నాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఆ సంరంభాలు, ఆ సంచలనాలు, ఆ సంఘటనలు ఇప్పటికీ నాకు అపరిమితమైన ఆనందం, ఉత్సాహం కలిగిస్తాయి.

నాకు పదేళ్ళు వచ్చిన నాటినుంచి ప్రకాశంగారిని ఎరుగుదును. మా నాయనగారు, ప్రకాశంగారు సమకాలికులు, ఆజీవ మిత్రులు, ఇద్దరూ న్యాయవాద వృత్తిలో ప్రముఖులు. గాంధి మహాత్ముని నాయకత్వాన సాగుతున్న స్వాతంత్ర్య సమరంలో ప్రవేశించక పూర్వం ప్రకాశం పంతులుగారు మద్రాసులో ప్రముఖ న్యాయవాదిగా ప్రాక్టీసుచేస్తూ అమి