పుట:Naajeevitayatrat021599mbp.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రైలు పెట్టెలలో కూచున్న సార్జెంట్లకు కూడా తెలియదు. ఆ ట్రైనులో వస్తున్న ఒక పెద్ద పోలీసు ఉద్యోగి చెప్పిన స్టేషను వైపుకు బండి నడిపించడం తప్ప, ఆ బండి ఇంజను డ్రైవరుకుకూడా గమ్యస్థానం తెలియదు. ఈ పోలీస్ ఉద్యోగి స్టేషన్ కంట్రోల్స్ ద్వారా మేము వెళ్ళేత్రోవ, సమయం, సిగ్నల్స్ వగైరాలు ఏర్పాట్లు చేసుకునేవాడు. మధ్యాహ్నం మాట్రైను గూడూరు చేరినప్పుడు పెద్ద అల్లరి ఏదీ లేకుండానే మేము బండిదిగి రైల్వే హోటలుకు వెళ్ళి భోజనాలు చేశాము. అయితే, సాయంత్రం మేము విజయవాడ చేరేసరికి, పోలీసువారికీ, మాకూ ఉన్న సౌజన్యం కొంత చెడింది. మేమున్న కంపార్టుమెంటులోకి భోజనాలు తేవడానికి సదుపాయాలు అక్కడ కనిపించ లేదు. మమ్మల్ని రైలు పెట్టెలనుంచి దిగవద్దంటాడు పోలీసు ఉద్యోగి. ప్లాట్‌ఫారంమీద నాలుగైదు వేలమంది ప్రజలు గుమిగూడారు. పోలీసువారు, ప్రజలు ఒకరి నొకరు వెనక్కుతోసుకోవడంతో పెద్ద గలాటా బయలుదేరింది. మాలో కొందరికి భోజన సదుపాయాలు కలిగినవి. కాని, భోజనశాలకు దూరంగా ఉన్న మా కంపార్టుమెంటు, ప్రక్క కంపార్టుమెంటువారికి ఆ సౌకార్యాలు కలగలేదు. మా కంపార్టుమెంటులో సత్యమూర్తి గారున్నారు. రైలు కదిలేసరికి, ఆయన "వీడెలా ముందుకు నడుస్తాడో చూస్తా"నని అలారం గొలుసు గట్టిగా లాగారు. ట్రైను ప్లాట్‌ఫారం విడవకుండానే ఆగిపోయింది. అప్పుడు రైల్వేలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరుగా ఉన్న శర్మ అనే ఆయన మేమున్న కంపార్టుమెంటును - పోలీసు ఉద్యోగి వద్దంటున్నా వినక, భోజనశాలకు ఎదురుగా ఉండేటట్టు రైలును వెనక్కు నడిపించాడు. అప్పుడు అటూ ఇటూ పోలీసు సిబ్బంది నిలబడి, కార్డన్ (అడ్డు) కట్టగా, ఆ కార్డనులోనుంచి భోజనాలశాలకు వెళ్ళి, భోజనం చేయగలిగాము. ఆ రైల్వే ఆఫీసరు శర్మాగారిని, ఇక్కడ సత్యమూర్తిగారిని - ప్రకాశంగారు అన్నదాతలని ప్రశంసించారు.

మరునాడు పది, పదకొండు గంటల వేళకు మేము నాగపూరు రైల్వేస్టేషనుకు చేరుకున్నాము. మేము నాగపూరు జెయిలులో పరి