పుట:Naajeevitayatrat021599mbp.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                 లోకాభి రామయణాకలనంబున
                            చీకటి దర్బార్లు చెలగుచుండ,
                 నెమ్మి ప్రేక్షక వాహినీ చిత్రవర్ణాల
                            సంద్యాసురాగమ్ము సంతసిల్ల,
                 పాఠాక జన బృంద పాండిత్య సేచనన్
                            తింత్రిణీ వనరాశి తీపి గనగ,

                 విశ్వవేదాంత పీఠికా విస్తరంబు
                 తెలుగు తమిళ కర్ణాట కేరళ వినేత
                 లలవి నలరారు పరమ లీలాగృహమ్ము
                 తిరుచినాపల్లి కేంద్ర ఖైదీల గృహమ్ము." [ 10-1-1941 ]

నాయక, ఉపనాయక, రాజకీయ రణరంగ వీరుల సమూహ జీవనం నడిచే వేళలలో ప్రకాశంగారి బృందంలోని దాదాపు యాభైమంది దాకా ప్రతి దినం ఉదయంపూట, వారుండే గదికి ఎదురుగా ఉన్న పెద్ద చెట్టు దగ్గర సమావేశం కావడం ప్రారంభమైంది. ఆ బృందంలో చేరిన వారిలో గిరిగారు, అనంతశయనం అయ్యంగారు మొదలైన పెద్దలుకూడా ఉన్నారు. అలా సమావేశం కావడంచేత ప్రక్కన సంస్కృత గ్రంథాలను ఉంచుకుని, తెలుగు భారత భాగవతాలు ఒక పంక్తికూడా మిగల్చకుండా చదవగలిగినాము. వాల్మీకి రామాయణము చదివి అర్థం చెప్పడానికి అనంతశయనం అయ్యంగారు, నగరి కె. వరదాచారి, విద్వాన్ విశ్వం, మాడభూషి వెంకటాచారి మొదలైన వారు ఉండేవారు. మధ్యాహ్నాలలో బైబిలు పాత, క్రొత్త టెస్టమెంటులు మొదటినుంచి చివరిదాకా పూర్తిగా చదివాము. మహమ్మదలీ ఇంగ్లీషులోకి అనువదించిన ఖురానును గూడా పూర్తిగా చదివాము. ఇలా చదివేవారు చదువుతుండగా, అర్థ వ్యాఖ్యానాలు చేసేవారు చేస్తుండగా - ముప్పై, నలబై మందికి ఎప్పుడూ తక్కువగాని ఈ పాఠక బృందానికి అధ్యక్షులైన ప్రకాశంగారు ఒక ఎక్సర్‌సైజు పుస్తకంలో నోట్సు వ్రాసుకునేవారు.