పుట:Naajeevitayatrat021599mbp.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉంటాడని మాట ఇచ్చిన మీదటనే రాజాజీ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పాటయింది.

అయినప్పటికీ, మొదటి కాబినెట్ మీటింగులోనే, గవర్నర్ కాబినెట్ మీటింగులకు అధ్యక్షత వహించేటట్లు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పొరబాటని ప్రకాశంగారికి తోచింది. అలా తోచడం న్యాయమే. కాని, రాజాజీ మాత్రం ప్రకాశంగారి మాట వినలేదు. నూటికి నూరుపాళ్ళూ గాంధీ తత్వవాది అన్న పేరు తనకు కలిగినప్పుడు ఇతరుల మాట తానెందుకు వినాలి? పాత భేదాభిప్రాయాలతో బాటు ప్రకాశం, - రాజాజీల మధ్య వైమస్యం ప్రబలడానికి ఇదికూడా ఒక గట్టి కారణం అయింది. విప్లవ వాదివలె కనిపించే మితవాది శ్రీమాన్ రాజాజీ. మితవాదివలె కనిపించే విప్లవకారుడు ప్రకాశం. అందుచేత, ఎంత సర్దుకు పోదామని ప్రకాశంగారు యత్నిస్తూ వచ్చినా దృష్టి భేదం వల్ల ఏదో ఒక చిన్న తగాదా రావడమూ, మబ్బులు కమ్మడమూ - ఎలాగో తిరిగి క్షేమంగా ఆ మబ్బులు చెదరిపోవడమూ మంత్రివర్గం ప్రారంభమైన దగ్గరనుంచీ కొంత అలవాటయి పోయింది.

ఈ కార్య నిబంధనలో మరొక సూత్ర ముండేది. దాని ప్రకారం కార్యదర్శికి, మంత్రులవరకు కాగితం రాకుండానే, ఒక విషయంలో తుది నిర్ణయం తీసుకొనే హక్కుండేది. ఇదివరకే ఇటువంటి విషయంలో ఒక విధమైన తీర్పును బట్టి, మంత్రివర్గం గాని, ప్రభుత్వంగాని ఒక అభిప్రాయం తీసుకోవడంచేత ఆ అభిప్రాయం ప్రకారం కార్యదర్శియే తుది నిర్ణయంచేసి కాగితం తిరుగగొట్టవచ్చు. మంత్రిగారు తిరిగి పునరాలోచన చేయుదురా అన్న విషయం కార్యదర్శే ఊహించి, ఆ కాగితం మంత్రిగారికి పంపించాలా, అక్కరలేదా అన్న నిర్ణయం తానే తీసు కోవచ్చు. అది రెండు, మూడు శాఖలతో సంబంధించినప్పటికీ ఆయా శాఖల కార్యదర్శులు ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భాలలో అలాగే చేయవచ్చు. మంత్రులకు తెలియకుండానే ఈ విధంగా దాదాపు నూటికి డెబ్బై ఐదు పైళ్ళలో ప్రభుత్వం పేరున అటో ఇటో ఆర్డర్లు పడుతుంటాయి.