పుట:Naajeevitayatrat021599mbp.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందులో చందూ చెయ్యి గూడుతప్పి వుంది. తనకి లభించిన సేవతో, మేము ఇప్పించగల వైద్యసహాయంతో, తాను తీసుకున్న వ్యాయామాది నియమాలతో అతడు తన శిక్షాకాలం కులాసాగానే గడిపాడు.

మేజస్ట్రేట్ల చిత్తం, మా భాగ్యం

ఈ సమర సందర్భంలో శిక్షాధికారం పూర్తిగా మేజస్ట్రేట్ల వశం అవడాన్ని, వారి చిత్తం వచ్చినట్లు వ్యవహరించారు. శాసన సభా సభ్యుల విషయంలో, మేజస్ట్రేట్ల చిత్తమే వారి భాగ్యమయింది. ఒక తీరూ, ఒక తెన్నూ లేకుండా కొందరికి 'ఏ', కొందరికి 'బి', మరి కొందరికి 'సి' మేజస్ట్రేట్లు తమ ఇష్టానుసారం ఇవ్వడం జరిగింది. అనంతపురం ఎం. ఎల్. ఏ. కల్లూరు సుబ్బారావు, తంజావూరు హరిజన ఎం. ఎల్. ఏ. నాయనారు, తూర్పుగోదావరి జిల్లావాసి లక్ష్మణస్వామి, విశాఖపట్నం హరిజన ఎం. ఎల్. ఏ. సాకేటి గురువులు మున్నగు వారంతా 'బి' క్లాసుకు మార్చబడే దాకా 'సి' క్లాసులో ఉండేవారు. దర్మిలా, వారిని 'బి' నుంచి 'ఎ' కి గూడా మార్చడం జరిగింది.

ఏ క్లాసు ఆయనకు ఇచ్చారో తెలియని కారణంగా, మంత్రిగా ఉండిన బెజవాడ గోపాలరెడ్డిని మూడవ తరగతి రైలు పెట్టెలో ఎక్కించారు. సేలం జిల్లా బోర్డు అధ్యక్షుడుగా ఉంటూన్న ఎం. ఎల్. ఏ. మాచియప్ప గౌండరు కూడా వెల్లూరు జయిలుకు 'క్లాసు' నిర్ణయం లేకుండానే వచ్చాడు. కల్లూరు సుబ్బారావుని 'బి' క్లాసుకు మార్చినా ఆయన్ని మళ్ళీ ఎందుకో 'సి' కి మార్చడముతో, 'సి' క్లాసు ఖైదీగా రెండు వారాలు గడచిన తర్వాతగాని తిరిగి ఆయన్ని 'బి' క్లాసుకు మార్చక పోవడమూ జరిగింది. శ్రీ నాయనారూ, లక్ష్మణ స్వామీ మూడు వారాలపాటు 'సి' క్లాసులో ఉన్నా, 'బి' క్లాసుకు మార్చబడ్డారు.

చాలా మంది రాష్ట్ర శాసన సభ్యులనూ, అనంతశయనం అయ్యంగారూ, తిరుమలరావూ వంటి కేంద్ర శాసన సభ్యులనూ 'బి' క్లాసులో ఉంచారు. గ్రంథి వెంకటరెడ్డి నాయుడూ, ఎమ్. సుబ్బారావూ,