పుట:Naajeevitayatrat021599mbp.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కందుల వీర రాఘవస్వామి, కె. వెంకటస్వామి నాయుడు (మాజీ మదరాసు మేయరు), రాఘవమేనోన్ వగైరాలకు ప్రారంభంలో 'ఎ' క్లాసు ఇచ్చినా, వారిని 'బి' క్లాసులోకి మార్చారు. ఆ రోజులలో వెల్లూరు జెయిలుకు సంబంధించినంతవరకూ మిగిలిన 'ఎ' క్లాసు ఖైదీలను 'సి' క్లాసులోకి ఎప్పుడయినా వెళ్ళమంటారేమోననే అనుమానం మాకందరికీ ఉండేది.

మామూలు ప్రపంచక జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా, ప్రభుత్వపు తీరు తెన్నులనూ, పద్ధతులనూ గ్రహించి ఉంటే, చట్టనిర్మాణం చేయగల వ్యక్తులను ఏ ప్రకారంగా చూడాలో అర్థమయి ఉండేది. కాని కాంగ్రెసు ప్రభుత్వంలో పనిచేసి ఉన్నా, మేజిస్ట్రేట్లలో కొంతమందికి ఆ మాత్రపు ప్రపంచ జ్ఞానం కూడా లేకుండాపోయింది. గవర్నరుగారికి గాని, వారి సలహాదారులకు గాని ఖైదీలకు ఎ, బి, సి, క్లాసుల నిర్ణయించబడుతూన్న విధానంపట్ల గాని, శాసన సభ్యులనేకాదు మాజీ మంత్రులను కూడా జెయిలు అధికారులు చూస్తున్న విధం పట్లగాని ఏ విధమయిన శ్రద్ధా, పట్టింపూ లేకుండా పోయాయి. మాజీ మంత్రులూ, శాసన సభ్యులూ, అఖిల భారత కాంగ్రెసు కమిటీ మెంబర్లూ మున్నగు సత్యాగ్రహుల గతి ఏమయినా ఈ గవర్నర్లకూ, వారి అడ్వయిజర్లకూ చీమ కుట్టదు. అవును, ఎందుకు కుట్టాలి? జెయిల్లో మళ్ళీ జెయిలు అన్నట్లు మాజీ మంత్రులను కూడా రాత్రి ఆరు గంటలూ, ఉదయం ఆరు గంటలా మధ్య లాకపులో ఉంచినా వారికి పోయిందేమీ లేదు. అటువంటప్పుడు మామూలు ఎం. ఎల్. ఎ.లు, ఏ. ఐ. సి. సి. మెంబర్లూ అల్లా రాత్రి తెల్ల వార్లూ, సాయంత్రం ఆరునుంచి ఉదయం ఆరువరకూ లాకప్పులోని లాకప్పుతో సతమత మవుతేనేం? ఇది వారి రాజ్యాంగ విధానమేగా!

తలకి చమురు ప్రశ్న

మొదట్లో మేము జెయిళ్ళకు వెళ్ళగానే, మా సంఖ్య చాలా తక్కువగా ఉంటూన్నంత కాలమూ, మమ్మల్ని మా గదులలో మూసిపెట్టేవారు. జెయిలులో మావి ఒకే వరుసలో ఉన్న గుహలలాంటి