పుట:Naajeevitayatrat021599mbp.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహం చేసే పద్ధతిలో గాంధీగారిని నినాదాల్నే వాడవలసిందనీ, నేను ఆ నినాదాల్నే ఉచ్చరిస్తూ ఆనాడే ఉదయం 11 గంటలకు తంబుచెట్టి వీధిలో సత్యాగ్రహం చేయనున్నాననీ చెప్పాను. అప్పుడు గిరిగారు తానూ, రాజగోపాలాచారిగారూ కలిసి ప్రయాణం చేసిన సంగతీ, దారిలో ఆయనగారికీ, తనకూ మధ్య నడచిన సంభాషణంతా నాతో చెప్పారు.

గిరిగారు నేను సత్యాగ్రహం చేస్తూన్న సమయంలో అక్కడే, నా పక్కనే ఉన్నారు. తరవాత ఆయన ఇతర మిత్రులతో కలిసి మేజస్ట్రేట్ కోర్టుకూ వచ్చారు. ఆ తరవాత వెంటనే ఉన్న రైలులో నన్ను వెల్లూరు జెయిలుకు పంపడం కూడా గిరిగారూ, ఆయన మిత్రులూ పూర్తిగా గమనించారు.

ఆఖరిమాటగా ఉత్తరం

రాజగోపాలాచారిగారు గాని, డా॥ సుబ్బరాయన్ గాని - ఉభయులూ పట్నంలోనే ఉన్నా - నన్ను కలిసికోలేదు. నేను జెయిలుకు వెళ్ళాక, తిరిగీ రాజగోపాలాచారిగారు గిరిగారిని కలిసి, ఆంధ్రులు ఎంత మాత్రమూ మంచివారు కాదనీ, గిరిగా రయినా తనమాట విని, గాంధీగారి నినాదం కంటె తన ఉత్తరమే శ్రేష్ఠమని గ్రహించి, తాను సూచించిన ప్రకారం నడవడం ఉత్తమ మనీ మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగిందని తెలిసింది. రాజగోపాలాచారి గారెంత జెప్పినా గిరిగారు మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు, గాంధీగారి నినాదంలోని ఆఖరి రెండు పంక్తులయినా విడిచిపెట్టడం న్యాయమని రాజగోపాలాచారి గారు చెప్పారట. ఆఖరి వాక్యాలలో, హింసాత్మకమయిన అన్ని యుద్ధాలనూ అహింసాత్మకంగానే ఎదుర్కోవాలని ఉంది. రాజగోపాలాచారి గారి వాదన గిరిగారు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. ఇంకా కాదూ కూడదూ అంటూ ఆయన వదలిపెట్టకుండా ఉంటే, "సరే, మీరు చెప్పిన విషయం జాగ్రత్తగా ఆలోచించి సాయంత్రం మీ కే సంగతి వ్రాస్తా"నని చెప్పి గిరిగారు అప్పటికి ఆ గొడవ తప్పించుకుని, ఆ సాయంత్రం ఆయన పేర ఉత్తరం వ్రాశారు.