పుట:Naajeevitayatrat021599mbp.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిండిపోతూన్న సందర్భాన్ని పురస్కరించుకుని, జెయిలు నిబంధనావళిలో అటువంటి రాజకీయ ఖైదీల ఆహారమూ, ఖైదీలుగా ధరించవలసిన ఉడుపుల తీరూ, పైల్ పద్ధతీ మొదలైన ఎన్నో విషయాలలో జెయిలు నిబంధనలు న్యాయంగా మార్చవలసి ఉన్నాయి. కాని ఆ రోజులలో అధికారంలో ఉన్న పెద్దల కెవ్వరికీ, రాజకీయ ఖైదీల విషయంలో కొన్ని మార్పులు చేయడం న్యాయమన్న ఆలోచన తట్టలేదు. అందువల్ల వారికీ, ఇతర ఖైదీలకు ఏ విధమయిన భేదాలూ చూపబడలేదు.

ఇప్పటికీ చాలా జెయిళ్ళలో ఈ పైల్ పద్ధతి అమల్లోనే ఉంది. తిరుచిరాపల్లిలోనూ, మదరాసు పెనిటెంషరీలోనూ జరిగిన పద్ధతిగానే వెల్లూరు జెయిలులోకూడా ఆ పైల్ పద్ధతి అమలు పరచబడింది. మేమంతా ఒక వరసలో నిలవక తప్పేదికాదు. ఈ రకమయిన 'తలవంపు పద్ధతి' మాకు ఎంతో చికాకుగా ఉండేది. కాని సత్యాగ్రహుల మవడం వల్ల సరిపెట్టుకోక తప్పేదికాదు. మేము ఈ విషయంలో సూపరెంటెండెంట్‌గారితో మాట్లాడాము. ఆయన ఆ పద్ధతి అమలు పరచకపోతే వారి పీకలమీదికి వస్తుందని సమాధాన మిచ్చాడు.

అసలు ఈ ఫైల్ పద్ధతి ప్రకారం వారానికి ఒకటి రెండుసార్లు ఖైదీలందరూ ఒక వరసలో నిలబడాలి. అట్లా నిలబడిఉన్న ఖైదీల నందరినీ జెయిలరూ, సూపరెంటెండెంటూ సరిగా ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఖైదీలందరూ నిటారుగా నిలబడి, వారివారి బరువును చూపించే, తూకపు ఛార్టులను సరిగా పట్టుకుని నిలబడాలి. అధికార్లకు, ఎవరయినా బరువు తగ్గిందీ లేందీ, ఆ పద్ధతివల్ల వెంటనే గ్రాహ్యం అవ్వాలన్నమాట. అటువంటి సమయంలో ఏమయినా చెప్పుకోవడానికి ఖైదీలకు సావకాశం ఉండేది. ఈ పద్ధతి రాజకీయ ఖైదీలకు వర్తించరాదని వాదించే వారిలో నేను ఒకణ్ణి.

మేజర్ ఖాన్ చతురజ్ఞత

'సి' క్లాసు వారితోసహా మా సంఖ్య పెరిగినకొద్దీ, మాకు కొన్ని కొన్ని సదుపాయాలు కలుగజేశారు. కొంత కాలంపాటు మాలో 'ఎ'